గృహోపకరణాల ధరలు పై పైకే

1 Jul, 2017 19:08 IST|Sakshi
గృహోపకరణాల ధరలు పై పైకే
న్యూఢిల్లీ:  జీఎస్‌టీ  కొత్తపన్నులు అమల్లోకి రావడంతో అనేక గృహోపకరణాల ధరలు మోత మోగనున్నాయి.  జీఎస్‌టీ పరిధిలో ప్రస్తుత పన్ను రేటు 25-27శాతంనుంచి  28 శాతానికి చేరడంతో ఇప్పటికే డ్యూరబుల్‌   మేకర్స్‌ ధరలను పెంచేశారు.  దీంతో శనివారం నుంచి ఈ వస్తువులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి బాదుడు తప్పదు.  అంతేకాదు రానున్న దసరా , దీపావళి  పండుగల సీజన్‌లో మరోసారి ధరల పెంపు తప్పదనే అంచనాలు నెలకొన్నాయి.  
ఇన్పుట్ క్రెడిట్ (ముడి పదార్ధాల,  విడిభాగాల  ప్రస్తుత స్టాక్) ఆధారంగా ధరల సమీక్ష ఉండనుండటంతో ఈ పండుగ సీజన్‌ (దసరా, దీపావళి)  టీవీలు, ఫ్రిజ్‌, ఏసీ, వాసింగ్‌ మెషీన్‌  లాంటి  ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలు బాగా పెరగనున్నాయి.   జీఎస్‌టీ కారణంగా తమపై 2-3శాతం భారం పడనున్న కారణంగా  పండుగల ముందు ధరల పెంపు తప్పదని తయారీదారులు భావిస్తున్నారు. 
 
 తమ రంగానికి సంబంధించి పన్ను పెరిగిందనీ, 28శాతంగా జీఎస్‌టీ పన్ను నిర్ణయించడంతో మార్జిన్‌ను  నిలబెట్టుకోవటానికి ధరలు పెంచక తప్పదని  గోద్రేజ్  గృహోపకరణాల బిజినెస్‌ హెడ్‌,  ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు.  ఇప్పటికే  50శాతం డిస్కౌంట్లను డీలర్లు అందించారన్నారు. అలాగే గిడ్డంగుల్లో ఉన్న స్టాక్‌ క్లియర్‌ కావడంతో పాటు, టాక్స్‌ క్రెడిట్‌ పొందడానికి   ఇంకా  రెండు మూడు నెలల సమయం పడుతుందన్నారు.  
సోమవారం లేదా మంగళవారం నాటికి అన్ని బ్రాండ్ల ధరల జాబితా వెల్లడికానుందని తెలిపారు. ఈ జాబితా వెల్లడి అనంతరం వ్యాపారం ప్రారంభం కానుందని చెప్పారు.  ఇతర వాణిజ్య భాగస్వాములు ఇప్పటికే తమ స్టాక్లను విక్రయించి, కొనుగోళ్లను ప్రారంభించారని నంది చెప్పారు. ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో భారీ అమ్మకాలను ఆశించడంలేదన్నారు. కానీ నెమ్మదిగా పుంజుకుంటాయని ఆశిస్తున్నామన్నారు. 
 
అయితే ధరల పెంపుపై   మరో గృహోపకరణాల విక్రయ సంస్థ పానసోనిక్‌ వచ్చే వారం నిర్ణయం తీసుకోనుంది.  రేపటినుంచే కాదుకానీ,   తరువాతి వారంలో  ధరలను సమీక్షిస్తామని  పానాసోనిక్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్  డైరెక్టర్ అజయ్ సేథ్ చెప్పారు.
 
మరిన్ని వార్తలు