గిఫ్టులకు జీఎస్‌టీ మినహాయింపు

11 Jul, 2017 01:32 IST|Sakshi
గిఫ్టులకు జీఎస్‌టీ మినహాయింపు

న్యూఢిల్లీ: కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే గిఫ్టులకు సంబంధించి రూ. 50,000 దాకా విలువ ఉండే బహుమతులు.. వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) పరిధిలోకి రావని కేంద్రం పేర్కొంది.  అలాగే కంపెనీలు తమ సిబ్బందికి క్లబ్‌లు, హెల్త్‌.. ఫిట్‌నెస్‌ సెంటర్లలో ఉచిత సభ్యత్వం కల్పించినా.. జీఎస్‌టీ వర్తించదని స్పష్టం చేసింది.

ఉద్యోగరీత్యా కంపెనీకి ఉద్యోగి అందించే సేవలు కూడా వస్తు, సేవల పన్నుల విధానం పరిధిలోకి రావని పేర్కొంది. ఒక ఏడాదిలో కంపెనీ తమ ఉద్యోగులకు రూ. 50,000కు లోబడి ఇచ్చే గిఫ్టులకు జీఎస్‌టీ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ’బహుమతి’ని ఉద్యోగి దీన్ని తన హక్కుగా భావించడానికి లేదని స్పష్టం చేసింది.

అద్దె ఆదాయం రూ. 20 లక్షలు దాటితే జీఎస్‌టీ
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ప్రాపర్టీలపై వచ్చే అద్దె ఆదాయం వార్షికంగా రూ. 20 లక్షలు మించితే జీఎస్‌టీ వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి హస్‌ముఖ్‌ అధియా తెలిపారు. జీఎస్‌టీ మాస్టర్‌ క్లాస్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. నివాస గృహాల అద్దె ఆదాయాలకు ప్రస్తుతం వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) నుంచి మినహాయింపు ఉంది. మరోవైపు, 69.32 లక్షల పైచిలుకు రిజిస్టర్డ్‌ ఎక్సైజ్, సర్వీస్‌ ట్యాక్స్, వ్యాట్‌ చెల్లింపుదారులు జీఎస్‌టీఎన్‌ పోర్టల్‌కి మళ్లినట్లు జీఎస్‌టీ నెట్‌వర్క్‌ సీఈవో ప్రకాశ్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో ఇప్పటికే 38.51 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లు, వారికి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు జూన్‌ 25 నాటి నుంచి 4.5 లక్షల దాకా కొత్త అసెసీలు జీఎస్‌టీఎన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లు కుమార్‌ చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా