పన్ను బాదుడుకు నోటిఫికేషన్‌

4 Sep, 2017 11:01 IST|Sakshi
పన్ను బాదుడుకు నోటిఫికేషన్‌

సాక్షి, న్యూఢిల్లీ: పెద్దకార్లు, లగ్జరీ కార్లపై  జీఎస్‌టీ పెంపునకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం  జారీచేసింది. మిడ్-సైజ్ నుండి హైబ్రీడ్ వేరియంట్లపై  గరిష్టంగా 25 శాతం వరకు  సెస్‌  పెంపునకు  ప్రభుత్వం  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టయింది. లగ్జరీ కార్ల ధరలు మోత మోగనున్నాయి.

వస్తువులు,  సేవల పన్ను (రాష్ట్రాలకు పరిహారం) ఆర్డినెన్స్, 2017 సవరణ  నోటిఫికేషన్‌  ప్రభుత్వం జారీ చేసింది.  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తర్వాత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబరు  2వతేదీ నుంచి  ఈ పెంపు అమలులోకి వచ్చింది. దీనికి పార్లమెంట్‌  అమోదం లభించాల్సి ఉంటుంది. అయితే ఏయే కార్లపై  గరిష‍్టంగా ఎంతపన్ను బాదుడు ఉంటుంది అనేది   కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ  అధ్యక్షతన  ఈనెల (సెప్టెంబరు)  9న  హైదరాబాద్‌లో జరగనున్న జీఎస్‌టీ కౌన్సిల్‌  తదుపరి సమావేశంలో  తేలనుంది.

ఈ ఏడాది జులై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి రావడంతో కార్ల ఉత్పత్తి సంస్థలు ధరలను రూ.లక్ష నుంచి 3లక్షల మధ్య తగ్గించాయి. ప్రస్తుతం అమలవుతున్న సెస్‌ 15 నుంచి గరిష్టంగా 25 శాతానికి పెరగడంతో ఈ ప్రీమియం సెగ్మెంట్‌ కార్ల ధరలు  మోత  మోగనున్నాయి.  స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌(ఎస్‌యూవీలు), లగ్జరీ కార్లన్నింటిపైనా పెరిగిన సెస్‌ అమలు కానుంది.

పెద్ద మోటార్ వాహనాలు, ఎస్యూవీలు, మిడ్ సెగ్మెంట్ కార్లు, పెద్ద కార్లు, హైబ్రిడ్ కార్లు, హైబ్రిడ్ మోటార్ వాహనాలపై సెజ్‌  25 శాతంగా ఉండనుంది. గతంలో ఇది 15శాతం. జీఎస్‌టీ పరిధిలో లగ్జరీ, ఎస్‌యూవీ, మరియు ఇతర వాహనాలపై పన్ను పెంపు ప్రతిపాదనకు  ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గత వారం ఆమోదించిన సంగతి  తెలిసిందే.
 

మరిన్ని వార్తలు