ఈ కార్ల ధరలన్నీ తగ్గిపోనున్నాయి..

1 Jul, 2017 12:26 IST|Sakshi
ఈ కార్ల ధరలన్నీ తగ్గిపోనున్నాయి..
గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ రేపటి నుంచి అమలు కాబోతున్న తరుణంలో కొన్ని కార్లు, టూవీలర్స్‌ చాలా చౌకగా లభ్యం కాబోతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం ముందస్తు ఉన్న పన్ను రేట్ల కంటే జీఎస్టీ అమలు తర్వాత వేయబోయే పన్ను రేట్లు తక్కువగా ఉండటమే. ఆల్టో, స్విఫ్ట్‌, డిజైర్‌, ఐ20 ఎలైట్‌ వంటి కార్లపై కనీసంగా రూ.6,500 నుంచి .. రూ.15వేల వరకు ధరలు తగ్గబోతున్నాయని తెలిసింది. ప్రస్తుతం ఈ కార్లపై 31.4 శాతం పన్ను రేట్లు ఉండగా.. వాటిని జీఎస్టీ రేటు కింద 29 శాతానికే తీసుకొచ్చారు. మిడ్‌ సైజు కార్లపై పన్ను రేట్లు ​కూడా 3.6 శాతం కిందకి దిగొచ్చాయి.

దీంతో వీటి ధరలు కూడా రేపటి నుంచి తగ్గనున్నాయని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. హోండా సిటీ, హ్యుందాయ్‌ వెర్నా, మారుతీ సియాజ్‌, ఫోక్స్‌వాగన్‌ వెంటో వంటి సెడాన్ల ధరలు కనీసం 30వేల రూపాయల వరకు తగ్గనున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ అమలు తర్వాత లగ్జరీ కార్ల తయారీ సంస్థలు ఎక్కువగా లాభపడతారని కూడా తెలిపారు. మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, ఆడీ, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ వంటి కంపెనీలు ఇప్పటికే రూ.1.25 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. జీఎస్టీ రేటు ప్రయోజనాలు ఈ మేరకు వినియోగదారులకు చేరవేస్తున్నామని తెలిపాయి. 
 
స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల ధరల్లో ఎక్కువ మొత్తంలో తగ్గింపును చూస్తామని తెలిసింది. జీఎస్టీ కింద వీటి పన్ను రేట్లు 43 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం వీటి పన్ను రేట్లు 55.3 శాతంగా ఉన్నాయి. అంటే స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల పన్ను రేట్లు భారీగా 12.3 శాతం మేర తగ్గబోతున్నాయి. కార్ల సంస్థలపై వేసే ఐదు రకాల పన్నులు , లెవీలు- ఎక్సైజ్‌, ఎన్‌సీసీడీ, ఇన్ఫ్రా సెస్‌, సీఎస్‌టీ, వ్యాట్‌ లను కలిపి జీఎస్టీ కిందకు తీసుకొచ్చారు. దీంతో ఈ కార్ల సంస్థల పన్ను రేట్లు కిందకి దిగి వచ్చాయి.

ఇతర ఛార్జీలు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ ధరలు, ఇన్సూరెన్స్‌ వంటి వాటిని జీఎస్టీలో కలుపలేదు. కానీ ఇవి కార్ల సంస్థలపై అంత పెద్ద మొత్తంలో ప్రభావం చూపవని తెలుస్తోంది. కార్ల ధరలు మాదిరిగానే బైకులు, స్కూటర్ల ధరలు కూడా 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు తగ్గిపోనున్నాయి. 3500సీసీ కంటే తక్కువ ఇంజిన్‌ కలిగిన అన్ని టూ-వీలర్స్‌ ధరలు 2.2 శాతం పడిపోనున్నాయని తెలుస్తోంది. అయితే పెద్ద ఇంజిన్ల బైకుల రేట్లు కనీసం 1000 రూపాయల మేర పెరగనున్నాయి. అంతేకాక హైబ్రిడ్‌ వాహనాల రేట్లు కూడా ఖరీదైనవిగా మారబోతున్నాయని తెలిసింది. 
మరిన్ని వార్తలు