ఈ-కామర్స్ లావాదేవీలపైనా జీఎస్‌టీ!

20 Jul, 2015 01:31 IST|Sakshi
ఈ-కామర్స్ లావాదేవీలపైనా జీఎస్‌టీ!

న్యూఢిల్లీ : ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి ఈ-కామర్స్ కంపెనీలను కూడా చేర్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఈ-కామర్స్ లావాదేవీల్లో సరఫరా చేసే చోటు(ప్లేస్ ఆఫ్ సప్లై)కు సంబంధించిన నిబంధనలను కేంద్ర రెవెన్యూ శాఖ రూపొందిస్తోంది. దీనివల్ల ఆన్‌లైన్ షాపింగ్‌ను పన్ను చట్రంలోకి తీసుకురావడం సులువవుతుందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. జీఎస్‌టీలో ఈ నిబంధనలు చాలా కీలకమని కూడా చెప్పారు. ఎక్కడైతే వస్తువులను కస్టమర్‌కు డెలివరీ చేస్తారో ఆ గమ్యం(డెస్టినేషన్) ఆధారంగా పన్ను విధించనున్నట్లు ఆయన వివరించారు.

వస్తువుల సరఫరా ఒకే రాష్ట్రం పరిధిలో(ఇంట్రా-స్టేట్) జరుగుతోందా... ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయా(ఇంటర్ స్టేట్) అనేది కూడా ఈ నిబంధనలవల్ల సులువుగా గుర్తించేందుకు వీలవుతుంది. కాగా, జీఎస్‌టీ అమలు నిబంధనలు రూపొందించనున్న కేంద్రీయ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు(సీబీఈసీ).. ముసాయిదా(డ్రాఫ్ట్)ను సిద్ధం చేసిన తర్వాత ఈ-కామర్స్ పరిశ్రమ వర్గాల నుంచి దీనిపై సలహాలు, సూచనలు కోరనున్నట్లు సీబీఈసీ సభ్యుడు వీఎస్ కృష్ణన్ చెప్పారు. దేశీ ఈ-కామర్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం 5 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.33 వేల కోట్లు)గా అంచనా. కాగా, జీఎస్‌టీ అమలుకు అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎలాగైనా జీఎస్‌టీని అమలు చేయాలనేది కేంద్రం ప్రణాళిక.

మరిన్ని వార్తలు