మాల్యా కోసం...జైలుగా మారనున్న గెస్ట్‌హౌస్‌

14 Nov, 2017 12:04 IST|Sakshi

సాక్షి,ముంబయి: బ్యాంకులకు రూ వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడు, లండన్‌లో తలదాచుకున్న విజయ్‌ మాల్యాను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. అప్పగింత కేసులో భారత్‌లో జైళ్ల పరిస్థితిని సాకుగా చూపుతున్నలిక్కర్‌ దిగ్గజం మాల్యాకు చెక్‌ పెట్టేందుకు మహారాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం ద్వారా పలు ప్రతిపాదనలు పంపగా, తాజాగా ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ను జైలుగా మార్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది.

బ్రిటన్‌ నుంచి తనను తరలించకుండా ఉండేందుకు భారత్‌లో జైళ్ల పరిస్థితి దయనీయంగా ఉంటుందని మాల్యా తన న్యాయవాదులతో బ్రిటన్‌ న్యాయస్ధానం ముందు వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా దేశంలో ఏ ప్రాంతాన్ని అయినా జైలుగా ప్రకటించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు విశేషాధికారాలున్నాయని ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. దేశంలో జైళ్లు బాగాలేవని మాల్యా అప్పగింతకు దాన్ని అవరోధంగా భావిస్తే...ఆయనకు అనుగుణంగా ఉండేలా గెస్ట్‌హౌస్‌లోనే మాల్యాను ఉంచుతామని, దాన్నే ప్రభుత్వం జైలుగా ప్రకటించవచ్చనే ప్రతిపాదనను పరిశీలించాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు.

బ్రిటన్‌ కోర్టులో జరుగుతున్న మాల్యా అప్పగింత కేసులో పదునైన వాదనలు వినిపించేందుకు అవసరమైన వ్యూహాన్ని మంగళవారం జరిగే భేటీలో హోంమంత్రిత్వ శాఖ ఖరారు చేయనుంది. మాల్యా న్యాయవాదులు లేవనెత్తే అంశాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఎలాంటి వాదనను తెరపైకి తేవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

మాల్యా అప్పగింత కేసు విచారణ డిసెంబర్‌ 4న జరగనుంది. మాల్యా న్యాయవాదుల వాదనలను తిప్పికొట్టేందుకు సకల సౌకర్యాలున‍్న ముంబయి ఆర్థర్‌ రోడ్డు జైలును ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఈ జైలులోని బ్యారక్‌ 12లో మాల్యాను ఉంచుతామంటూ దానికి సంబంధించిన ఫోటోలనే హోంమంత్రిత్వ శాఖకు మహారాష్ర్ట ప్రభుత్వం పంపింది. యూరప్‌లోని జైళ్లతో సరిపోలేలా ఆర్ధర్‌ రోడ్డు జైలు బ్యారక్‌ నెంబర్‌ 12 ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.

మరిన్ని వార్తలు