అవినీతిపై ఐఎంఎఫ్‌ మరింత దృష్టి

24 Apr, 2018 00:35 IST|Sakshi

జులై 1 నుంచి గుడ్‌గవర్నెన్స్‌ మార్గదర్శకాలు

వాషింగ్టన్‌:  ప్రపంచ దేశాల్లో అవినీతిని రూపుమాపేందుకు తీసుకోతగిన చర్యలకు సంబంధించి ఐఎంఎఫ్‌ కొత్త విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం ఉగ్రవాదులకు నిధులను అడ్డుకునేందుకు కీలకమైన ఆర్థిక సంస్థలు, సెంట్రల్‌ బ్యాంకులు, మార్కెట్ల నియంత్రణ సంస్థలు, మనీ లాండరింగ్‌ చట్టాలు తీసుకుంటున్న చర్యలపై ఐఎంఎఫ్‌ మరింతగా దృష్టి సారిస్తుంది. చిన్నవైనా, పెద్దవైనా.. సభ్యత్వం ఉన్న మొత్తం 189 దేశాలూ అమలు చేసేలా గుడ్‌ గవర్నెన్స్‌ మార్గదర్శకాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి.

సామాన్యుల ప్రయోజనాలను, ఆర్థిక పురోగతి అవకాశాలను అవినీతి దెబ్బతీస్తుందని, అందుకే మరింత సమర్ధంగా అవినీతిని నిరోధించేందుకు తాజా ప్రమాణాలను రూపొందించామని ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టీన్‌ లగార్డ్‌ తెలిపారు. ఇప్పటిదాకా సంపన్న దేశాలకు ఒక రకం, ఇతర దేశాలకు మరో రకం విధానాలను అమలు చేస్తూ వస్తున్న ఐఎంఎఫ్‌ తాజాగా అన్ని దేశాలకూ ఒకే రకమైన విధానాలు అమలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. 17.5 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ కోసం ఉక్రేనియా ప్రభుత్వం మరింత కఠినమైన అవినీతి నిరోధక సంస్కరణలు అమలు చేస్తున్న తరుణంలో ఐఎంఎఫ్‌ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.  

మరిన్ని వార్తలు