బ్యాంక్‌ స్కాం : నైజీరియాకు చెక్కేసిన నితిన్‌

24 Sep, 2018 13:05 IST|Sakshi
బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ అధినేత నితిన్‌ సందేసర (ఫైల్‌ఫోటో)

అహ్మదాబాద్‌ : నీరవ్‌ మోదీ వ్యవహారం మరువకముందే మరో భారీ బ్యాంక్‌ స్కాంలో ప్రధాన నిందితుడు దర్జాగా విదేశాలకు చెక్కేసిన ఉదంతం వెలుగుచూసింది. గుజరాత్‌ ఫార్మా దిగ్గజం నితిన్‌ సందేసర రూ 5000 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడి నైజీరియాకు పారిపోయినట్టు తెలిసింది. నితిన్‌ను గతనెలలో దుబాయ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారని వార్తలు వచ్చినా ఆయన నైజీరియాకు పారిపోయినట్టు తాజాగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం వెల్లడించింది. నితిన్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ గ్రూప్‌ ప్రమోటర్లు నకిలీ, తప్పుడు  డాక్యుమెంట్లతో పలు బ్యాంకుల నుంచి సేకరించిన రూ 5000 కోట్లు అనంతరం మొండిబాకీలుగా మారాయని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 

ఆంధ్రా బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, ఎస్‌బీఐ, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి బ్యాంకుల కన్సార్షియం రుణాలను మంజూరు చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి  యూఏఈ అధికారులు గతనెలలో దుబాయ్‌లో నితిన్‌ సందేసరను అదుపులోకి తీసుకున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, అంతకుముందే నితిన్‌ ఆయన కుటుంబ సభ్యులు నైజీరియాలో తలదాచుకున్నారని తెలిసిందని ఆ కథనం పేర్కొంది.

నితిన్‌ సోదరుడు చేతన్‌ సందేసర, మరదలు దీప్తిబెన్‌ సందేసర సహా కుటుంబ సభ్యులు నైజీరియలో ఉన్నట్టు సమాచారం. రూ 5000 కోట్ల బ్యాంక్‌ అక్రమ లావాదేవీలు, మనీల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి గుజరాత్‌కు చెందిన నితిన్‌ సందేసర కంపెనీ స్టెర్లింగ్‌ బయోటెక్‌ గ్రూప్‌కు చెందిన రూ 4700 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జూన్‌లో అటాచ్‌ చేసింది.

మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టం కింద సంస్థకు చెందిన 4000 ఎకరాలతో పాటు, ప్లాంట్‌, యంత్రాలు, సంబంధిత కంపెనీలు, ప్రమోటర్లకు చెందిన 200 బ్యాంకు ఖాతాలు, రూ6.67 కోట్ల విలువైన షేర్లు, లగ్జరీ కార్లు, వాహనాలను అటాచ్‌ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టం కింద భారీ మొత్తంలో ఆస్తులను అటాచ్‌ చేసిన కేసుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు