నకిలీ కరెన్సీ ఎక్కువగా దొరికింది అక్కడే..!

7 Aug, 2018 16:49 IST|Sakshi
నకిలీ కరెన్సీ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : నకిలీ కరెన్సీ నిర్మూలించడానికి, అవినీతిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల రద్దు అనంతరం దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున్న నకిలీ కరెన్సీని పట్టుకున్నాయి. అయితే అత్యధిక నకిలీ కరెన్సీని గుజరాత్‌లోనే సీజ్‌ చేసినట్టు కేంద్రం నేడు లోక్‌సభకు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.13.87 కోట్లకు పైగా నకిలీ కరెన్సీని సీజ్‌ చేస్తే, వాటిలో ఎక్కువగా గుజరాత్‌లో రూ.5.94 కోట్లను సీజ్‌ చేసినట్టు వెల్లడించింది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ)లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం హోం వ్యవహారాల సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారం అహిర్ ఈ విషయాన్ని లోక్‌సభలో వెల్లడించారు. 

పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్‌ 9 నుంచి ఈ ఏడాది జూన్‌ 30 వరకు నేపాల్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ బోర్డర్లతో పాటు, రాష్ట్రాల్లో మొత్తం రూ.13.87 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను(ఎఫ్‌ఐసీఎన్‌) సీజ్‌ చేశామని చెప్పారు. దీనిలో అత్యధికంగా గుజరాత్‌లో రూ.5.94 కోట్లను సీజ్‌ చేసినట్టు పేర్కొన్నారు. గుజరాత్‌ అనంతరం ఉత్తరప్రదేశ్‌లో రూ.2.19 కోట్లను, పశ్చిమ బెంగాల్‌లో రూ.2 కోట్లను, మిజోరాంలో కోటి రూపాయలను సీజ్‌ చేసినట్టు చెప్పారు. నకిలీ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నట్టు అనుమానం ఉన్న వారిపై కేంద్ర, రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌, సెక్యురిటీ ఏజెన్సీలు నిఘా ఉంచాయని, వారిపై చర్యలు కూడా తీసుకున్నాయని మంత్రి తెలిపారు. నకిలీ కరెన్సీని సృష్టించడం, స్మగ్లింగ్‌ చేయడం, చలామణిలోకి తీసుకురావడం చట్టవిరుద్ధ చర్యలు (నివారణ) చట్టం, 1967 కింద ఉగ్రవాద కార్యకలాపాల కిందకు వస్తాయి. 

మరిన్ని వార్తలు