7,614 కోట్లు సమీకరించిన జీవీకే

29 Oct, 2019 04:41 IST|Sakshi

విమానాశ్రయ వ్యాపారంలో వాటా విక్రయం

ముంబై ఎయిర్‌పోర్టులో వాటా పెంపు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగంలో ఉన్న జీవీకే గ్రూప్‌ రుణ భారం తగ్గించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌లో 79.1 శాతం వాటాను విక్రయించింది. తద్వారా రూ.7,614 కోట్లు సమీకరించింది. అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఏడీఐఏ), పబ్లిక్‌ సెక్టార్‌ పెన్షన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ (పీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్‌), నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌తో (ఎన్‌ఐఐఎఫ్‌) ఈ మేరకు జీవీకే పవర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ కంపెనీలైన జీవీకే ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్, జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ మధ్య ఆదివారం ఒక ఒప్పందం కుదిరింది. డీల్‌ తదనంతరం జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌లో జీవీకే ఎయిర్‌పోర్ట్‌ డెవలపర్స్, ఏడీఐఏ, పీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్, ఎన్‌ఐఐఎఫ్‌ వాటాదారులుగా ఉంటాయి. జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌లో జీవీకే గ్రూప్‌ వాటా 20.9 శాతానికి పరిమితం అవుతుంది.  డీల్‌లో భాగంగా ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్, నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ను రూ.9,608 కోట్లుగా విలువ కట్టారు.  

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో..
డీల్‌ ద్వారా వచ్చిన నిధులను ప్రాథమికంగా హోల్డింగ్‌ కంపెనీల్లో సుమారు రూ.5,500 కోట్ల రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగించనున్నారు. అలాగే ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌లో (ఎంఐఏఎల్‌) జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ తన వాటాను పెంచుకోనుంది. ఇందుకోసం ఎంఐఏఎల్‌లో దక్షిణాఫ్రికా సంస్థలు అయిన బిడ్‌వెస్ట్, ఎయిర్‌పోర్ట్స్‌ కంపెనీ సౌత్‌ ఆఫ్రికాలకు (ఏసీఎస్‌ఏ) ఉన్న వాటాను కొనుగోలు చేయనుంది. ఎంఐఏఎల్‌లో బిడ్‌వెస్ట్‌కు 13.5 శాతం, ఏసీఎస్‌ఏకు 10 శాతం వాటా ఉంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీవీకే గ్రూప్‌ కంపెనీ అయిన ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తోంది. ఇక కొత్తగా నిర్మితమవుతున్న నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఐఏఎల్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో (ఎన్‌ఎంఐఏ) ఎంఐఏఎల్‌కు 74 శాతం వాటా ఉంది.  

నిష్క్రమణ కోసం..
ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌లో (ఎంఐఏఎల్‌) వాటాదారులైన బిడ్‌వెస్ట్, ఏసీఎస్‌ఏ ఎప్పటి నుంచో తప్పుకోవాలని చూస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు ఉన్న 23.5 శాతం వాటాను అదానీ కొనుగోలు చేయాలని భావించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అదానీ ప్రయత్నానికి అడ్డుకట్ట పడ్డట్టే. ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు 50.5 శాతం, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు 26 శాతం వాటా ఉంది. బిడ్‌వెస్ట్, ఏసీఎస్‌ఏల నుంచి 23.5 శాతం వాటా దక్కించుకోవడం ద్వారా.. జీవీకే గ్రూప్‌ వాటా 74 శాతానికి చేరనుంది. అయితే రైట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ రెఫ్యూజల్‌ కింద ఈ ఏడాది ప్రారంభంలో బిడ్‌వెస్ట్‌ తన 13.5 శాతం వాటాను విక్రయించనున్నట్టు జీవీకేకు తెలిపింది. అందుకు జీవీకే అంగీకరించింది. వాటా కింద ఇవ్వాల్సిన రూ.1,248 కోట్ల చెల్లింపు ఆలస్యం కావడంతో ఢిల్లీ హైకోర్టును బిడ్‌వెస్ట్‌ ఆశ్రయించింది. హైకోర్టు సూచన మేరకు వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ను బిడ్‌వెస్ట్‌ ఆశ్రయించింది. అక్టోబరు 31లోగా ఈ చెల్లింపు పూర్తి చేయాలని జీవీకేను ట్రిబ్యునల్‌ ఆదేశించింది.

జీవీకే నిర్వహణలోనే..
వాటా విక్రయం తర్వాత ఎయిర్‌పోర్ట్‌ వ్యాపార నిర్వహణ, బ్రాండింగ్‌ అంతా జీవీకే గ్రూప్‌ కిందనే ఉంటాయని సంస్థ తెలిపింది. గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్టర్లు వెనుక ఉండడం ఎంఐఏఎల్, ఎన్‌ఎంఐఏ విస్తరణకు కలిసి వస్తుందని వివరించింది. ఎయిర్‌పోర్టుల వ్యాపారం మరింత బలంగా ఎదిగేందుకు దోహద పడుతుందని తెలిపింది. ఎంఐఏఎల్, నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా జీవీకే రెడ్డి, ఎండీగా జీవీ సంజయ్‌ రెడ్డి కొనసాగనున్నారు. వాస్తవానికి ఎయిర్‌పోర్ట్‌ వ్యాపారంలో 49 శాతం వాటాను ఏడీఐఏ, ఎన్‌ఐఐఎఫ్‌లకు విక్రయించాలన్న ప్రతిపాదనపై ఏప్రిల్‌లో సంతకాలు జరిగాయి.

మరిన్ని వార్తలు