ఆస్ట్రేలియా ప్రాజెక్టుకు అనుమతి: జీవీకే

10 Oct, 2014 01:19 IST|Sakshi
ఆస్ట్రేలియా ప్రాజెక్టుకు అనుమతి: జీవీకే

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీవీకే గ్రూప్ ఆస్ట్రేలియాలో చేపట్టనున్న ప్రతిపాదిత ఆల్ఫా కోల్ ప్రాజెక్టుకు ఆరేళ్ల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు పర్యావరణ అనుమతి పొందింది. పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసేందుకు 500 మందికిపైగా కన్సల్టెంట్ నిపుణులు 300పైగా శాస్త్రీయ అధ్యయనాలు చేపట్టారని కంపెనీ తెలిపింది. క్వీన్స్‌లాండ్‌లోని గెలీలి బేసిన్‌లో 10 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో అల్ఫా కోల్ ప్రాజెక్టును జీవీకే హాన్‌కాక్ చేపట్టిన సంగతి తెలిసిందే.

ప్రాజెక్టులో భాగంగా గని అభివృద్ధితోపాటు రైల్వే లైన్, నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్టు పూర్తి అయితే గెలీలీ బేసిన్ ప్రసిద్ధ కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని జీవీకే ఫౌండర్ చైర్మన్ జీవీకే రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గనిలో 2016 నాటికి తొలి లాట్ వస్తుందని అంచనా. కార్యకలాపాలు పూర్తి స్థాయికి చేరుకున్నాక ఏటా 3.2 కోట్ల టన్నుల బొగ్గు వెలికితీస్తారు. మౌలిక వసతుల ఏర్పాటుకై కోల్ రైల్ నిర్వహణ కంపెనీ ఆరిజన్ హోల్డింగ్స్‌తో సంయుక్త భాగస్వామ్య ఒప్పందం పూర్తి కావాల్సి ఉంది. అనుమతుల విషయంలో ఉన్న వ్యాజ్యాలను నియంత్రణ సంస్థలు పరిష్కరిస్తే బొగ్గు విక్రయ ఒప్పందాలను కుదుర్చుకుంటామని జీవీకే తెలిపింది. జీవీకే హాన్‌కాక్‌లో జీవీకే 79 శాతం, హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్‌కు 21 శాతం వాటా ఉంది. 

మరిన్ని వార్తలు