ఐటీ పరిశ్రమపై హెచ్‌1-బీ వీసా రద్దు ప్రభావం స్వల్పమే: క్రిసెల్‌

7 Jul, 2020 13:32 IST|Sakshi

పరిశ్రమ లాభదాయకత 0.25శాతం క్షీణించే అవకాశం

భారత ఐటీ కంపెనీలపై హెచ్‌1-బీ వీసా రద్దు ప్రభావం స్వల్పంగానే ఉంటుందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసెల్ తెలిపింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత ఐటీ రంగానికి రూ.1200 కోట్ల మేర మాత్రమే ప్రభావం పడుతుందని రేటింగ్‌ ఏజెన్సీ తెలిపింది. ఐటీ పరిశ్రమ లాభదాయకత 0.25-0.30శాతం మేర క్షీణించే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ పేర్కోంది.  గత కొన్నేళ్లుగా భారత ఐటీ కంపెనీలు అమెరికాలో స్థానికులకు అధికస్థాయిలో ఉద్యోగాలను కల్పిస్తోందని, ఫలితంగా వీసా సంబంధిత సమస్యల వల్ల కలిగే నష్టాలు పరిమితమయ్యే అవకాశం ఉందని క్రిసెల్‌ తన నివేదికలో పేర్కోంది.  యూఎస్‌లో నిరుద్యోగ కట్టడి చర్యలో భాగంగా ట్రంప్‌ ప్రభుత్వం గతనెలలో హెచ్‌-1వీసాలను ఏడాదిపాటు రద్దుచేసిన సంగతి తెలిసిందే.  

టాప్‌-15 ఐటీ కంపెనీల ప్రదర్శనను పరిగణలోకి తీసుకోన్న క్రిసెల్‌...  కోవిడ్‌-19 ప్రభావంతో  వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐటి సంస్థల లాభాలు 2.50శాతానికిపైగా క్షీణించడంతో పాటు నిర్వహణ లాభదాయకత 23శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.  ఎంట్రీ సిస్టమ్‌ స్థాయి ఉద్యోగాలను స్థానికుల ద్వారా భర్తీ చేయడంతో హెచ్‌1-బి, ఎల్‌ 1 వీసాలపై అమెరికా తీసుకున్న నిర్ణయం పెద్దగా ప్రభావాన్ని చూపదు. అలాగే వీసాల పునరుద్ధరణ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపదని రేటింగ్‌ సంస్థ తెలిపింది. 

మరిన్ని వార్తలు