హెచ్‌-1బీపై కొత్త బిల్లు : భారతీయులకు ముప్పే!

27 Jan, 2018 18:17 IST|Sakshi

బెంగళూరు : వార్షికంగా హెచ్‌-1బీ వీసాల కోటాను పెంచాలంటూ ఇద్దరు రిపబ్లికన్లు ఓ కొత్త బిల్లును అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు అమెరికన్‌ టెక్‌ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ లాంటివి మద్దతిచ్చాయి కూడా. అయితే అమెరికన్‌ దిగ్గజాలు సపోర్టు ఇచ్చిన ఈ బిల్లు భారతీయ ఐటీ కంపెనీలకు, భారత ఐటీ నిపుణులకు ఉపయోగకరమా? అంటే. అలాంటిదేమీ లేదని నిపుణులు వెల్లడిస్తున్నారు.  ఆరిన్ హాచ్, జెఫ్ఫ్ ఫ్లాక్ ప్రవేశపెట్టిన ''ది ఇమ్మిగ్రేషన్‌ ఇన్నోవేషన్‌ యాక్ట్‌-2018''లో హెచ్‌-1బీ వీసాల కోటాను ఏడాదికి 65వేల నుంచి 85వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో పాటు ఈ కొత్త బిల్లు హెచ్‌-1బీ వీసా ప్రొగ్రామ్‌లో సంస్కరణలు కోరుతోంది. వీసా ఫీజులను పెంచి, ఆ నిధులను సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమేటిక్స్‌ ఎడ్యుకేషన్‌ శిక్షణకు వాడాలంటూ ప్రతిపాదిస్తోంది. 

ఈ బిల్లు కనుక పాస్‌ అయితే, దేశీయ ఐటీ సర్వీసెస్‌ కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ అని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ వేతనం, మెదడుపై పనిభారాన్ని పెంచి, ముప్పు తెచ్చుస్తుందని పేర్కొంటున్నారు. సాధారణంగా గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ లాంటి కంపెనీలు హెచ్‌-1బీ వీసాలతో లబ్ది పొందుతూ ఉంటాయని, కాబట్టి వారు మద్దతు ఇవ్వడం సాధారణమని చెప్పారు. అదే కనీసం వేతనం లక్ష డాలర్లకు పెంచితే, ఈ కంపెనీలు ప్రతిభావంతులను ఆక‌ర్షించుకుంటాయని బెంగళూరుకు చెందిన గ్లోబల్‌ టెక్నాలజీ సంస్థల రిక్రూటర్‌ హెడ్‌ హంటర్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో క్రిష్‌ లక్ష్మికాంత్‌ తెలిపారు. కానీ కనీస వేతనం పెంపుతో, దేశీయ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, విప్రోల నుంచి అమెరికాకు వెళ్లే వారు తగ్గిపోతారని పేర్కొన్నారు. కంపెనీలు అక్కడే నియామకాలు చేపడతాయని చెప్పారు. దీంతో ఈ బిల్లు భారత్‌కు ఎంతమాత్రం మంచిది కాదని తెలిపారు.     

మరిన్ని వార్తలు