షాకింగ్‌: సగం ఏటీఎంలు మూత

21 Nov, 2018 20:10 IST|Sakshi

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) సంచలన రిపోర్టు

దేశవ్యాప్తంగా దాదాపు 1.13 లక్షల ఏటీఎంలు మూత

సర్వీసు ప్రొవైడర్ల నెత్తిన మోయలేని భారం

ప్రమాదంలో వందలాది ఉద్యోగాలు

ఏటీఎంల వద్ద క్యూలు, గందరగోళం తప్పదు

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికి సగానికి సగం ఏటీఎంలు మూత పడనున్నాయనే షాకింగ్‌ న్యూస్‌ సంచలనంగా మారింది.  స్వయంగా ట్రీ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi)  బుధవారం (21 నవంబరు) నివేదించింది.  దేశవ్యాప్తంగా దాదాపు 1.13 లక్షలఏటీఎంలు మూతపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ)  అంచనా ప్రకారం దేశంలో ప్రస్తుతం 2.38 లక్షల ఏటీఎంలు అందుబాటులో ఉండగా, అందులో సగానికి పైగా అంటే దాదాపు 1.13 లక్షల ఏటీఎంలు 2019 మార్చి కల్లా మూతపడే అవకాశాలున్నాయి.  ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్లు ఒత్తిడి చేయనున్నారని పేర్కొంది.  వీటిల్లో సుమారు లక్ష ఆఫ్‌ సైట్‌ ఎటిఎంలు, 15వేల వైట్ లేబుల్ ఏటీఎంలు ఉన్నాయని తెలిపింది. తాజా నియంత్రణలు, మార్పులు కారణంగా ఈ మూత తప్పకపోవచ్చని వెల్లడించింది.  వీటిలో మెజారిటీ ఏటీఎంలు పట్టణేతర ప్రాంతాల్లో ఉండొచ్చని, ప్రభుత్వ సబ్సిడీ లబ్ధిదారులు మెషీన్ల ద్వారా తీసుకునేందుకు వీలు కల్పించే చర్యలకు ఏటీఎంల మూత విఘాతం కావచ్చని తెలిపింది. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పిఎంజెడివై) పథకం కింద మిలియన్లమంది లబ్దిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారని  పేర్కొంది.

ఇటీవల చేపట్టిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్, ఇతర నియంత్రణ చర్యల్లో మార్పులు, క్యాష్ లోడింగ్‌కు అనుసరిస్తున్న క్యాసెట్ స్వాపింగ్ పద్ధతి వల్ల ఎటీఎం ఆపరేషన్లు ఆచరణ సాధ్యం కాకపోవచ్చని, ఫలితంగా ఏటీఎంలు మూతపడొచ్చని పేర్కొంది. సాంకేతిక పద్ధతుల్లో మార్పు, క్యాసెట్ క్యాష్ స్వాప్ విధానానికే కేవలం రూ.3,000 కోట్లు ఖర్చవుతుందని సీఏటీఎంఐ అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎం ఇండస్ట్రీ ఎదుర్కొన్న పరిస్థితికి అదనపు సాంకేతిక పరిజ్ఞానం తోడై పరిస్థితి మరింత దిగజారవచ్చని, సర్వీస్ ప్రొవైడర్ల నెత్తిన మోయలేని భారం పడుతుందని తెలిపింది. ఇది ఏటీఏంల మూతకు దారితీస్తుందని సీఏటీఎంఐ ప్రకటించింది.
 
ఏటీఎంల మూత కారణంగా  వేలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని సీఏటీఎంఐ  పేర్కొంది. అంతేకాదు నగదు కొరత వస్తే ఏటీఎంల దగ్గర భారీ  క్యూలు, గందరగోళం తప్పదని కూడా వ్యాఖ్యానించింది.

>
మరిన్ని వార్తలు