బంగారు నగలకు... హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి!!

4 Apr, 2018 00:26 IST|Sakshi

త్వరలోనే బీఐఎస్‌ నోటిఫికేషన్‌

ముందు మెట్రోల్లో అమలు..

ముంబై: బంగారు ఆభరణాల నాణ్యతను ధృవీకరించే హాల్‌మార్కింగ్‌ నిబంధనలను సత్వరం అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) రూపొందించిన మార్గదర్శకాలకు కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఇది వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్దకు ఈ ప్రతిపాదన చేరింది.

బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తామంటూ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు సత్వరం ఆమోదం లభిస్తుందని, త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముసాయిదా నిబంధనల ప్రకారం మొత్తం మూడు రకాల బంగారు ఆభరణాల (22, 18, 14 క్యారట్‌)కు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి కానుంది.

సమగ్ర పసిడి విధానంలో భాగంగా ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేయాలంటూ గత నెల కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన నివేదికలో నీతి ఆయోగ్‌ కమిటీ సిఫార్సు చేసింది. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు సమస్యలు తలెత్తకుండా దీన్ని అమలు చేసే మార్గాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే ప్రతిపాదిత పసిడి విధానంలో మిగతా అంశాల సంగతి ఎలా ఉన్నా ముందుగా హాల్‌మార్కింగ్‌ అంశాన్ని అమల్లోకి తేవడంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గా లు తెలిపాయి. నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చాక.. హాల్‌మార్కింగ్‌ లేని ఆభరణాలను విక్రయించుకుని, క్లియర్‌ చేసుకునేందుకు జ్యుయలర్స్‌కి సుమారు 6 నెలల వ్యవధి దొరకవచ్చని పేర్కొన్నాయి.  

ఆన్‌లైన్‌లో అనుమతులపై దృష్టి..
హాల్‌మార్కింగ్‌ను సత్వరం అమల్లోకి తెచ్చే దిశగా .. దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా వేగవంతం చేయడంపై బీఐఎస్‌ దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లోనే జ్యుయలర్స్‌కి లైసెన్సు జారీ చేసే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ప్రతిపాదన ప్రకారం ముందుగా.. 22 ప్రధాన నగరాల్లో తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ నిబంధనను అమల్లోకి తేనున్నారు. ఆ తర్వాత రాష్ట్రాల రాజధానులు, తర్వాత జిల్లాల హెడ్‌క్వార్టర్స్‌లోనూ అమలు చేస్తారు.  

566 హాల్‌మార్క్‌ సెంటర్స్‌..: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 566 హాల్‌మార్కింగ్‌ సెంటర్స్‌ ఉన్నట్లు ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హాల్‌మార్కింగ్‌ సెంటర్స్‌ ప్రెసిడెంట్‌ హర్షద్‌ అజ్మీరా తెలిపారు. ఇవన్నీ ప్రస్తుతం సగటున ఇరవై శాతం సామర్ధ్యంతో పనిచేస్తున్నాయన్నారు.

ఒకవేళ హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసిన పక్షంలో పెరిగే పనిభారాన్ని తట్టుకోవడం కష్టమేమీ కాబోదన్నారు. హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి చేసే యోచన నేపథ్యంలో కొత్త హాల్‌మార్క్‌ సెంటర్స్‌ ఏర్పాటుకు సంబంధించి మరో 100 పైచిలుకు దరఖాస్తులు బీఐఎస్‌ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం జ్యుయలర్స్‌ బీఐఎస్‌ నుంచి తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే, మొత్తం ఆభరణాల విక్రేతల్లో పది శాతం కన్నా తక్కువ  .. సుమారు 25,000 జ్యుయలర్స్‌ మాత్రమే లైసెన్సు తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 3,00,000 పైచిలుకు జ్యుయలర్స్‌ ఉన్నారని అంచనా. మరోవైపు పది బులియన్‌ రిఫైనరీలు కూడా లైసెన్సు తీసుకున్నాయి.

మరిన్ని వార్తలు