ఏంజెల్‌ ట్యాక్స్‌పై స్టార్టప్‌లలో ఆందోళన

20 Dec, 2018 00:56 IST|Sakshi

ఆర్థిక శాఖతో వాణిజ్య శాఖ చర్చలు

కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు వెల్లడి

న్యూఢిల్లీ: ఏంజెల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపుతుండటం.. స్టార్టప్‌ సంస్థలను కలవరపెడుతోంది. పలు స్టార్టప్‌లు వీటిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. దీనిపై ఆర్థిక శాఖతో చర్చిస్తున్నట్లు సైటు ట్విటర్‌లో పేర్కొన్నారు.మరోవైపు, పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) గుర్తింపు లేని స్టార్టప్స్‌కు మాత్రమే ఏంజెల్‌ ట్యాక్స్‌ నోటీసులు జారీ అవుతుండవచ్చని ఆదాయ పన్ను శాఖ అధికారి తెలిపారు. అటు ఈ నోటీసుల కారణంగా ఏంజెల్‌ ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు పన్నులపరమైన వేధింపులకు గురికాకుండా చూడాలని రెవెన్యూ విభాగం దృష్టికి తీసుకెళ్లినట్లు డీఐపీపీ వెల్లడించింది.

స్టార్టప్‌లలో సిసలైన పెట్టుబడులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. ప్రారంభ దశలోని స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లను ఏంజెల్‌ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తారు. ఇలాంటి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులతో పాటు మొత్తం పెట్టుబడులు రూ. 10 కోట్ల లోపే ఉంటే పన్నుల నుంచి మినహాయింపులు ఉంటున్నాయి. సముచిత మార్కెట్‌ రేటుకు మించి ప్రీమియంతో ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ పెట్టుబడులు పెట్టారని భావించిన పక్షంలో అలా సేకరించిన అధిక మొత్తానికి 30 శాతం పన్ను రేటు వర్తిస్తుందని ఆదాయ పన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీన్నే ఏంజెల్‌ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు.   

మరిన్ని వార్తలు