పేటీఎం మెసేజ్‌లు, సీఈవో హెచ్చరిక

21 Nov, 2019 12:03 IST|Sakshi

పేటీఎం నుంచి ఆ మెసేజ్ వచ్చిందా?

కేవైసీ స్కాం, ప్లీజ్‌ నమ్మకండి - పేటీఎం సీఈవో

సాక్షి, ముంబై:  ప్రముఖ ఇ-వాలెట్‌ సంస్థపేటీఎం నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాజాగా  తన వినియోగదారులను హెచ్చరించింది. ఈ మేరకు  పేటీఎం  సీఈవో విజయ్ శేఖర్ శర్మ ట్విటర్‌లో ఒక సందేశాన్ని పోస్ట్‌ చేశారు.  కెవైసీ వివరాలు అందించకపోతే  అకౌంట్‌ బ్లాక్‌ అవుతుందని, సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమంటూ వినియోగదారులకు మెసేజ్‌లు రావడంతో  ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  ఈ వ్యవహారంపై స్పందించిన విజయ్‌ శేఖర్‌ కేవైసీ స్కాంపై కస్టమర్లను అలర్ట్‌ చేశారు.

మీ పేటీఎం ఖాతాకు సంబంధించిన కేవైసీ వివరాలకోసం ఏదైనా మెసేజ్‌ వచ్చిందా..అయితే అలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండమని ఆయన హెచ్చరించారు. పేటీఎం అలాంటి వివరాలను వినియోగదారులను కోరడం లేదని, అలాగే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని తాము సూచించమని వినియోగదారులకు స్పష్టం చేశారు. అలాంటి సందేశాలను, కాల్స్‌ను నమ్మవద్దని కోరారు. అలాగే భారీ బహుమతి, లక్కీ చాన్స్‌ అంటూ వచ్చే మెసేజ్‌ల మాయలో పడొద్దని కూడా ఆయన సూచించారు. మీ వివరాలను హ్యాక్‌ చేయడానికి మెసగాళ్లు చేసే పని ఇదని వారి వలలో పడకండి  అంటూ ఆయన హెచ్చరించారు. ఇదో కుంభకోణమని పేర్కొన్న ఆయన దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మరోవైపు చాలామంది వినియోగదారులు తమకూ ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయని ట్విటర్‌లో షేర్‌ చేయడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు