మహిళా ఉద్యోగులకు కార్పొరేట్ అలర్ట్స్

11 Dec, 2014 01:11 IST|Sakshi
మహిళా ఉద్యోగులకు కార్పొరేట్ అలర్ట్స్

ఉబర్ క్యాబ్ ఘటన నేపథ్యంలో ఈ-మెయిల్స్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళా ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేస్తున్న కార్పొరేట్ సంస్థలు.. అటు స్వీయ జాగ్రత్తలూ పాటించాలంటూ ఉద్యోగులకు సూచనలిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఉబర్ క్యాబ్ సంఘటన నేపథ్యంలో కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగులకు ఈ-మెయిల్, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో సందేశాలను చేరవేశాయి.

కంపెనీ సమకూర్చే క్యాబ్స్‌ను మాత్రమే ప్రయాణానికి వినియోగించాలని ఆ సందేశాల్లో సూచిస్తున్నాయి. ఒకవేళ ఇతర వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తే వాహనం నంబరును రాసుకుని, సంబంధీకులకు ఆ నంబరును చేరవేయాలని గుర్తు చేశాయి. అయితే భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించడమేగాక, ఉద్యోగులకు తరచూ సూచనలిస్తున్నట్టు కొన్ని కంపెనీలు వెల్లడించాయి.

ఈ-మెయిల్ సందేశాలు..
మహిళా ఉద్యోగులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్యానాసోనిక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోటెక్, ఆర్‌పీజీ గ్రూప్, ఏజిస్, జెన్సర్ టెక్నాలజీస్ తదితర సంస్థలు ఈ-మెయిల్, ఎస్‌ఎంఎస్ సందేశాలను పంపించాయి. కొన్ని కంపెనీలైతే సమావేశ మందిరాల్లో ఉద్యోగులకు సూచనలు చేస్తున్నాయి. రాత్రి వేళ త్వరగా పని ముగించుకుని, అవసరమైతే మర్నాడు ముందుగా రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నట్టు హైసియా ప్రెసిడెంట్, ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్ ఇండియా ఎండీ రమేశ్ లోగనాథన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.

భద్రత చర్యలు, స్వీయ రక్షణ గురించి హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) తరఫున అన్ని వేదికలపైనా చెబుతున్నామని అన్నారు. ‘కొన్ని క్యాబ్ కంపెనీలను నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. వేలాది అనధికార క్యాబ్స్ రోడ్లపై తిరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమే’ అని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు.

అలర్ట్స్ కొత్తేమీ కాదు..
భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు ఉద్యోగులకు గుర్తు చేస్తున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. ప్రతి శుక్రవారం అందరు ఉద్యోగులకు భద్రతపరమైన సందేశాలు పంపిస్తున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ‘రాత్రి 8 లోపే పనులను ముగిం చుకోవాలని మహిళా ఉద్యోగులకు చెబుతున్నాం. రాత్రి 8 తర్వాత వెళ్లేవారికి కంపెనీ కారులో గార్డు రక్షణతో పంపిస్తున్నాం. 10 ఏళ్ల నుంచి ఒకే క్యాబ్ ఆపరేటర్ సేవలందిస్తున్నారు.

వాహనాలు, భద్రత ఏర్పాట్లను క్యాబ్ ఆపరేటర్‌తో కలసి తరచూ సమీక్షిస్తున్నాం’ అని వెల్లడించారు. ఉద్యోగుల భద్రత చర్యలు నిరంతర ప్రక్రియ అని టీఎంఐ గ్రూప్ డీజీఎం అపర్ణా రెడ్డి తెలిపారు. స్వీయ రక్షణ విషయంలో ఉద్యోగులకు కంపెనీ నుంచి అలర్ట్స్ కొత్తేమీ కాదన్నారు.

మరిన్ని వార్తలు