హెచ్‌సీఎల్‌ లాభం రూ. 2,194 కోట్లు

19 Jan, 2018 23:54 IST|Sakshi

6 శాతం వృద్ధి

రూ.2 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.2,194 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ.2,070 కోట్లతో పోలిస్తే ఇది 6 శాతం అధికం. మరోవైపు, మొత్తం ఆదాయం 8.4 శాతం వృద్ధితో రూ.11,814 కోట్ల నుంచి రూ.12,808 కోట్లకు పెరిగింది.

సంస్థ.. ఒకో షేరుకు రూ.2 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు కనపర్చగలిగామని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రెసిడెంట్‌ సి.విజయకుమార్‌ ఈ సందర్భంగా చెప్పారు. సీక్వెన్షియల్‌గా 3.3 శాతం మేర, వార్షిక ప్రాతిపదికన 11.2 శాతం మేర వృద్ధి సాధించగలిగామని తెలియజేశారు.

ఈ ఆర్థిక సంవత్సరం గైడెన్స్‌కి సంబంధించి ఆదాయం కనిష్ట స్థాయిలో ఉన్నా... ఆదాయం, మార్జిన్లపరంగా ముందస్తు అంచనాలను అందుకోగలమన్నారు. కరెన్సీ మారక విలువ యథాతథ స్థితిలోనే కొనసాగిన పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం 10.5– 12.5 శాతం మేర, ఆపరేటింగ్‌ మార్జిన్‌ 19.5– 20.5 శాతం శ్రేణిలో ఉండగలదంటూ జూలైలో కంపెనీ గైడెన్స్‌ ఇచ్చింది.

కొత్తగా 20 డీల్స్‌..: డిసెంబర్‌ త్రైమాసికంలో 20 డీల్స్‌ కుదుర్చుకున్నట్లు విజయకుమార్‌ చెప్పారు. క్లయింట్లంతా ఐటీకి మరింత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం మరింత ఆశావహంగా ఉండగలదని అభిప్రాయపడ్డారు.

క్యూ3లో ఆర్థిక సేవల విభాగం ఆదాయాలు 11%, తయారీ 21%, లైఫ్‌సైన్సెస్‌.. హెల్త్‌కేర్‌ విభాగం సుమారు 10%, రిటైల్‌ 13% మేర పెరిగాయి. ఈ త్రైమాసికంలో నికరంగా 251 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,19,291కి చేరింది. బీఎస్‌ఈలో శుక్రవారం హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు 0.30% పెరిగి రూ. 958 వద్ద క్లోజయ్యింది.

మరిన్ని వార్తలు