హెచ్సీఎల్ టెక్ లాభం రూ.2,047 కోట్లు

4 Aug, 2016 01:30 IST|Sakshi
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.2,047 కోట్లు

న్యూఢిల్లీ : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. కంపెనీ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ.2,047 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.1,783 కోట్ల నికర లాభం సాధించామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. అన్ని రంగాలు, సర్వీస్ కేటగిరిల్లో మంచి వృద్ధి, కొత్త టెక్నాలజీలపై దృష్టి సారించడం తదితర అంశాల కారణంగా ఈ స్థాయి నికర లాభం సాధించామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ అనంత్ గుప్తా తెలిపారు. గత క్యూ1లో రూ.9,777 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.11,336 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన ఆదాయం 11 శాతం వృద్ధి చెందిందని వివరించారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే ఆదాయం 6 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. డాలర్ల పరంగా చూస్తే నికర లాభం 10 శాతం వృద్ధితో 30.5 కోట్ల డాలర్లకు, ఆదాయం 10 శాతం వృద్ధితో 169 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఫలితాల పరంగా ఇది మంచి త్రైమాసిక కాలమని అనంత్ గుప్తా చెప్పారు. ఓల్వొ ఐటీ సేవల విభాగంతో డీల్ కారణంగా కంపెనీ ఆదాయం 4 కోట్ల డాలర్లు పెరిగాయని, అంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే ఆదాయం 6.5 శాతం వృద్ధి చెందడానికి ఈ డీల్ తోడ్పడిందని వివరించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,240 కోట్లుగా ఉన్నాయని తెలిపారు.

 12-14 శాతం ఆదాయ వృద్ధి అంచనా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో 12-14% వృద్ధి సాధించగలమని కంపెనీ అంచనా వేస్తోంది. నాస్కామ్ ఆదాయ అంచనాలు(12-14%) కంటే ఇది అధికం. ఆదాయ అంచనాలను వెల్లడించడం దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ కంపెనీ మళ్లీ మొదలు పెట్టింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కంపెనీ షేరు 3% లాభంతో రూ.826 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు