హెచ్‌సీఎల్‌ బైబ్యాక్ ఆఫర్... ధరెంతో తెలుసా?

24 May, 2017 17:16 IST|Sakshi
హెచ్‌సీఎల్‌ బైబ్యాక్ ఆఫర్... ధరెంతో తెలుసా?
న్యూఢిల్లీ : దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సర్వీసుల సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తను ప్రకటించిన 3,500 కోట్ల బైబ్యాక్ ప్లాన్ లో ఒక్కో షేరుకు 1000 రూపాయలను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. అంటే ప్రస్తుత ట్రేడింగ్ ధరకు ఇది 17 శాతం ప్రీమియం. దామాషా ప్రాతిపదికన టెండర్ ప్రక్రియలో ఒక్కో ఈక్విటీ షేరుకు 1000 రూపాయల క్యాష్ ను ఆఫర్ చేయనున్నట్టు బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్ లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ చెప్పింది. ప్రస్తుతం ఒక్కో షేరు 852.35 రూపాయల వద్ద ట్రేడవుతుందని, ఈ ప్రస్తుత ట్రేడింగ్ ధరకు 17 శాతం ఎక్కువగా బైబ్యాక్ ఆఫర్ ధర ఉన్నట్టు తెలిపింది.
 
పూర్తిగా చెల్లించే ఈక్విటీ షేరు క్యాపిటల్ మొత్తంలో ఈ 3,500 కోట్ల రూపాయల బైబ్యాక్ సైజు 16.39 శాతం, 13.62 శాతంగా ఉన్నట్టు తెలిసింది. మే 25వ తేదీన కంపెనీ తన ఈక్విటీ షేర్ హోల్డర్స్ కు లెటర్ ద్వారా వీటిని ఆఫర్ చేస్తోంది. ఐటీ కంపెనీల్లో నగదు నిల్వలు ఎక్కువగా ఉండటంతో బైబ్యాక్స్ లేదా డివిడెండ్స్‌ ఆఫర్ చేయాలని ఒత్తిడి నెలకొంది. దీంతో గత నెలే టీసీఎస్ 16వేల కోట్ల రూపాయల బైబ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రస్తుతం ఇది కొనసాగింపు దశలో ఉంది.
 
టీసీఎస్ ప్రత్యర్థి ఇన్ఫోసిస్ కూడా ఈ ఏడాదిలో రూ.13వేల కోట్ల రూపాయలను డివిడెండ్‌ లేదా బైబ్యాక్ రూపంలో ఇన్వెస్టర్లకు రిటర్న్ ఇవ్వనున్నట్టు తెలిపింది. కాగా, 2016 డిసెంబర్ 31 వరకు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ వద్ద నగదు, నగదుతో సమానమైన నిల్వలు రూ.2,214.5 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.10,506.9 కోట్లున్నాయి. 
మరిన్ని వార్తలు