జీతాలు, బోనస్‌లు ఇస్తాం: హెచ్‌సీఎల్‌ టెక్‌

21 May, 2020 12:13 IST|Sakshi

కరోనా కాలంలోనూ బోనస్‌ ఇస్తున్న టెక్‌ కంపెనీ

ఎట్టిపరిస్థితుల్లోనూ జీతాలు కట్‌ చేయబోమని దేశంలోనే మూడో అతిపెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చెబుతోంది. తమ సంస్థలో పనిచేస్తోన్న 1,50,000 మందికి పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించడంతోపాటు, గతేడాది ఇచ్చిన హామీకి కట్టుబడి బోనస్‌లు కూడా ఇస్తామని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే దాదాపు 15 వేల మంది ఫ్రెషర్లకు ఇచ్చిన జాబ్‌ ఆఫర్లను గౌరవిస్తామని, ఆఫర్‌ లెటర్‌లు ఇచ్చిన వారందరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తెలిపింది.
 కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రాజెక్టులతోపాటు, కొత్త ప్రాజెక్టులు కొద్దిపాటి ఆలస్యంతో పూర్తి కావచ్చని హెచ్‌సీఎల్‌ టెక్నాజీ మానవ వనరుల ముఖ్యఅధికారి వీవీ అప్పారావు అన్నారు. ప్రాజెక్టులు ఏవీ కూడా ఇప్పటివరకు రద్దు కాలేదని తెలిపారు.. కొన్ని విభాగాలు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయి.దీంతో 5000 మంది కొత్త సిబ్బంది అవసరం ఉందని దానికోసం కొన్ని ప్రాంతాలలోని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తయారీ, రవాణా వంటి అంశాల్లో ఒత్తిడి ఎదుర్కోంటున్నామన్నారు.
   జూలై నెలలో వార్షిక అప్రైజల్‌ను కూడా ఇవ్వనున్నామన్నారు. గత 12 నెలల్లో ఉద్యోగులు ప్రదర్శించిన పనితీరు ఆధారంగా బోనస్‌లు ఇస్తామని పేర్కొన్నారు. 2008 వచ్చిన ఆర్థిక సంక్షోభం, ఆ తర్వాత వచ్చిన ఏ సంక్షోభంలోనూ మా కంపెనీ ఉద్యోగుల వేతనాల జోలికి వెల్లలేదని, తాజా సంక్షోభంలోనూ అదే విధానాన్ని అనుసరిస్తున్నామని అప్పారావు అన్నారు. కాగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ కారణంగా గత నెలలో ఉద్యోగుల ఉత్పాతదకత 16-17 శాతం పెరిగిందని, భవిష్యత్తులో 50 శాతం మంది ఉద్యోగులను ఇంటివద్దనుంచే పనిచేయించే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయ వివరించారు. ఉద్యోగ వలసలు 50 శాతం తగ్గాయని తెలిపారు. 
 ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితి పరిస్థితుల్లో కంపెనీల వృద్ధి ఎలా ఉంటుందో అంచనాలు వేయలేని పరిస్థితులు ఉన్నందున ఐటీ సెక్టార్‌లో దిగ్గజాలైన ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, డబ్ల్యూఎన్‌ఎస్‌ వంటి కంపెనీలు వేతనాలు ఇవ్వడంలోజాప్యం చేయడంతోపాటు, జీతాలు పెంపు, ప్రమోషన్స్‌ వంటి వాటిని ప్రస్తుతానికి నిలిపివేశాయి. కొత్త నియామకాలు తగ్గుతాయని విప్రో కంపెనీ గతంలోనే ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కంపెనీలపై పడుతున్న వ్యయభారాన్ని తగ్గించుకునేందుకు ఆయా కంపెనీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా రోల్స్‌రాయిస్‌, షేర్‌చాట్‌, ఓలా వంటి కంపెనీలు ఇప్పటికే కొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.

Related Tweets
మరిన్ని వార్తలు