హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం 14% అప్‌

25 Jan, 2017 01:12 IST|Sakshi
హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం 14% అప్‌

ఆదాయం 14 శాతం అప్‌
ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌

న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ క్వార్టర్లో రూ.2,070 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,920 కోట్ల నికర లాభం వచ్చిందని, 8 శాతం వృద్ధి సాధించామని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలి పింది. గత క్యూ3లో రూ.10,341 కోట్లుగా ఉన్న ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.11,814 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్‌కుమార్‌ చెప్పారు. డాలర్ల పరంగా చూస్తే నికర లాభం 5 శాతం వృద్ధితో 31 కోట్ల డాలర్లకు, ఆదాయం 11 శాతం వృద్ధితో 174 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.

జోరు కొనసాగింది...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–14 శాతం(డాలర్‌ టెర్మ్‌ల్లో అయితే 10–12 శాతం)వృద్ధి చెందగలదన్న అంచనా వేస్తున్నామని విజయ్‌ కుమార్‌ తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌ 30 తర్వాత కుదుర్చుకున్న భాగస్వామ్యాలు, తాము కొనుగోలు చేసిన సంస్థల కారణంగా తమ ఆదాయం 1 శాతం వరకూ అదనంగా పెరిగే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. ఈ క్వార్టర్‌లో కూడా తమ ఆర్థిక  పనితీరు జోరుగా కొనసాగిందని ఆదాయాల్లో 14 శాతం, క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ పరంగా 3 శాతం వృద్ధిని (నిలకడ రూపీ టర్మ్‌ల్లో)సాధించామని తెలిపారు. గత క్యూ3లో 61 శాతంగా ఉన్న స్థిర ధరల నిర్వహణ సేవల కాంట్రాక్టుల ఆదాయం ఈ క్వార్టర్‌లో 63 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు.

ఉద్యోగాలు తగ్గుతాయ్‌..
ఈ క్యూ3లో కొత్తగా 8,467 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య గత ఏడాది చివరి నాటికి 1.11 లక్షలకు పెరిగిందని  విజయ్‌ కుమార్‌ వివరించారు. ఉద్యోగుల వలస(ఆట్రీషన్‌ రేటు) 18 శాతంగా ఉందని తెలిపారు. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌వంటి కొత్త టెక్నాలజీల కారణంగా ఉద్యోగుల నియామకం తగ్గుతుందని ఆయన అంగీకరించారు. సిబ్బంది సంఖ్య 5–6 శాతమే పెరుగుతుందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో తమ ఆదాయాలు 12 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయని, సిబ్బంది సంఖ్య 6–7% చొప్పున మాత్రమే పెరిగిందని వివరించారు.
గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.2,214 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. ఈ క్యూ3లో మొత్తం  తొమ్మిది డీల్స్‌ కుదుర్చుకున్నామని తెలిపారు.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో  హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ 1% తగ్గి రూ.849 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు