హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం 2,550 కోట్లు

10 May, 2019 06:04 IST|Sakshi

ఒక్కో షేర్‌కు రూ.2 మధ్యంతర డివిడెండ్‌

ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల డాలర్ల ఆదాయ లక్ష్యం

హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌  

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  గత ఆర్థిక సంవత్సరం(2018–19) మార్చి క్వార్టర్‌లో రూ.2,550 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్‌లో రూ.2,230 కోట్ల నికర లాభం వచ్చిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. ఆదాయం రూ.13,178 కోట్ల నుంచి 21% వృద్ధితో రూ.15,990 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 14–16 శాతం రేంజ్‌లో వృద్ధి చెందగలదన్న అంచనాలున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల డాలర్ల(రూ.70,258 కోట్లు) ఆదాయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ఒక్కో షేర్‌కు రూ.2 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.  

డిమాండ్‌ జోరుగానే....
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో నికర లాభం 16 శాతం వృద్ధితో రూ.10,120 కోట్లకు, ఆదాయం 19% వృద్ధితో రూ.60,427 కోట్లకు పెరిగాయని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థిర కరెన్సీ ప్రాతిపదికగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో 12% ఆదాయ వృద్ధిని సాధించామని, అంచనాలను అందుకున్నామని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 6% వృద్ధితో 36.4 కోట్ల డాలర్లకు, ఆదాయం 12% వృద్ధి తో 220 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమకే కాకుండా, ఐటీ పరిశ్రమకు కూడా ఉత్తమ సంవత్సరం కానున్నదని పేర్కొన్నారు. టెక్నాలజీ సర్వీసులు, ఉత్పత్తులకు డిమాండ్‌ జోరుగా ఉండనున్నదని పేర్కొన్నారు. ఇక గత క్యూ4లో స్థూలంగా 14,249 మందికి ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది మార్చినాటికి 1,37,965కు పెరిగిందని విజయకుమార్‌ వివరించారు. ఏడాది కాలంలో ఆట్రీషన్‌ రేటు (ఉద్యోగుల వలస) 17.7%గా ఉందని పేర్కొన్నారు.
మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్‌ ఫ్లాట్‌గా రూ.1,132 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా