హెచ్సీఎల్ టెక్ లాభం 2,014 కోట్లు

22 Oct, 2016 00:17 IST|Sakshi
హెచ్సీఎల్ టెక్ లాభం 2,014 కోట్లు

17% వృద్ధి... సీక్వెన్షియల్‌గా 2% డౌన్
14% వృద్ధితో రూ.11,519 కోట్లకు ఆదాయం

 న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.2,014 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ2లో సాధించిన నికర లాభం రూ.1,726 కోట్లతో పోలిస్తే 17% వృద్ధి సాధించామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే మాత్రం నికర లాభం 2% తగ్గింది.

వేతనాలు పెరగడమే దీనికి కారణమని, ఈ క్యూ2లో ఆదాయం 14%వృద్ధితో రూ.11,519 కోట్లకు (అమెరికా గ్యాప్ అకౌంటింగ్ నిబంధనల ప్రకారం) పెరిగిందని కంపెనీ వివరించింది. ఇక నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 13% పెరిగిందని పేర్కొంది.డాలర్ పరంగా చూస్తే నికర లాభం 14% వృద్ధితో 30 కోట్ల డాలర్లకు, ఆదాయం 12% వృద్ధితో 172 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ప్రకటించింది.

12-14 శాతం రేంజ్‌లో ఆదాయ వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 12-14 శాతం రేంజ్‌లో (నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన) ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ బీఎస్‌ఈలో 2% లాభంతో రూ.831 వద్ద ముగిసింది.

అనంత్ గుప్తా టెక్‌సెలెక్స్ నిధి
ఇన్ఫోసిస్ నందన్ నీలేకని, విప్రో ప్రేమ్‌జీల బాటలోనే... హెచ్‌సీఎల్ సీఈఓగా పదవీ విరమణ చేయనున్న అనంత్ గుప్తా కూడా ఇన్వెస్టర్ అవతారం ఎత్తుతున్నారు. కొత్త వెంచర్ల కోసం రూ.100 కోట్ల నిధిని టెక్‌సెలెక్స్ పేరుతో ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులు తయారు చేసే సంస్థలకు తోడ్పాటునందించేందుకు ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనలిటిక్స్, డేటా సైన్స్, ఆటోమేషన్ రంగాలకు సంబంధించిన వెంచర్లకు తోడ్పాటునందిస్తామని తెలియజేశారు. ఈ టెక్నాలజీ వెంచర్లలో రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్లు లేదా వాటాల పరంగా చూస్తే 15 శాతం నుంచి 51 శాతం వరకూ పెట్టుబడులు పెడతామని చెప్పారు.

మరిన్ని వార్తలు