వాయిస్‌ ఓవర్‌ ఎల్‌టీఈ... ఎయిర్‌టెల్‌ రెడీ!

6 Nov, 2017 01:56 IST|Sakshi

ఏపీ, తెలంగాణల్లో నేడోరేపో అందుబాటులోకి

హెచ్‌డీ కాల్స్, అంతరాయం లేని డేటా

మూడేళ్లలో 3జీకి ఎయిర్‌టెల్‌ గుడ్‌బై?  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఎయిర్‌టెల్‌ వాయిస్‌ ఓవర్‌ ఎల్‌టీఈ సేవలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌కు విస్తరిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టు పూర్తి చేసుకుని ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా సర్వీసులు ప్రారంభించనుంది.

హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పట్టణాల్లో సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుతం కంపెనీ ముంబై, అహ్మదాబాద్‌లో మాత్రమే వాయిస్‌ ఓవర్‌ ఎల్‌టీఈని పరిచయం చేసింది. ఈ టెక్నాలజీతో కస్టమర్లు హై డెఫినిషన్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. వాయిస్‌లో స్పష్టత ఉంటుంది. మూడు రెట్ల వేగంతో కాల్‌ కనెక్ట్‌ అవుతుంది. మరో ప్రధాన విశేషమేమంటే డేటాను వినియోగిస్తూనే కాల్స్‌ చేసుకోవచ్చు. కాల్‌ డ్రాప్‌కు ఆస్కారం లేకుండా 4జీ లేని ప్రాంతాల్లో 3జీ లేదా 2జీ నెట్‌వర్క్‌కు అనుసంధానం అవుతుంది.  

అదనపు ఖర్చు లేదు..
కస్టమర్లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే ఎయిర్‌టెల్‌ వాయిస్‌ ఓవర్‌ ఎల్‌టీఈ సేవలను పొందవచ్చు. ఈ టెక్నాలజీని సపోర్ట్‌ చేసే 4జీ స్మార్ట్‌ఫోన్, సిమ్‌ ఉంటే చాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్యంగా చేసుకున్న 2,300 నగరాలు, పట్టణాలకుగాను 1,850 కేంద్రాల్లో ఎయిర్‌టెల్‌ 4జీ సేవలను అందిస్తోంది.

మిగిలిన అన్ని ప్రాంతాలకు వచ్చే ఏడాది ప్రారంభంలో అడుగు పెట్టనుంది. 4జీపైనే భారీ పెట్టుబడులు ఉంటాయని ఎయిర్‌టెల్‌ స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగానే ‘మేరా పెహలా స్మార్ట్‌ఫోన్‌’ పేరుతో బండిల్‌ ఆఫర్‌లో ఫీచర్‌ ఫోన్‌ ధరలో 4జీ హ్యాండ్‌సెట్లను కంపెనీ ప్రమోట్‌ చేస్తోంది. కార్బన్, సెల్‌కాన్‌తో భాగస్వామ్యం కుదుర్చు కుంది. మరిన్ని సెల్‌ఫోన్‌ కంపెనీలతోనూ ఇటువంటి ఒప్పందాలు చేసుకోనుంది.


కనుమరుగు కానున్న 3జీ..
భారత టెలికం రంగంలో 30 కోట్ల మంది 2జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నట్టు అంచనా. డేటా పరంగా చూస్తే కస్టమర్లను 4జీ వేగంగా ఆకర్షిస్తోంది. టెలికం దిగ్గజమైన ఎయిర్‌టెల్‌ 4జీ పైనే పెద్ద ఎత్తున ఫోకస్‌ చేస్తోంది.

కాగా, దేశంలో ముందుగా కనుమరుగయ్యే ది 3జీ నెట్‌వర్క్‌ అని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్‌ కాల్‌ సందర్భంగా ఎయిర్‌టెల్‌ ఇండియా, సౌత్‌ ఆసియా సీఈవో గోపాల్‌ విట్టల్‌ స్పష్టం చేశారు. 4జీ నెట్‌వర్క్‌ విస్తరణకు భారీ పెట్టుబడులు, సీఈవో వ్యాఖ్యలను చూస్తుంటే కంపెనీ 3జీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉన్నట్టు అవగతమవుతోంది. రెండు మూడేళ్లలో 3జీ సేవల నుంచి కంపెనీ తప్పుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. భారత్‌లో 2010లో 3జీ సర్వీసులను తొలుత ఎయిర్‌టెల్‌ ప్రారంభించింది. 

మరిన్ని వార్తలు