ఫండ్స్‌ ఆస్తులు ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్లకు..

24 Aug, 2018 01:32 IST|Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అంచనా

ముంబై: మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ వచ్చే ఐదేళ్ల కాలంలో రూ.50 లక్షల కోట్లకు చేరుతుందని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అంచనా వేశారు. అధిక సంఖ్యలో పనిచేసే వారు ఉండటం, మెరుగైన ఉపాధి అవకాశాల నేపథ్యంలో వారు మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి ఆర్థిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పోల్చి చూస్తే భారత్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విస్తరణ జీడీపీలో చాలా తక్కువ శాతం ఉందని, ప్రపంచ సగటు 62%గా ఉంటే, మన దగ్గర 11 శాతమే ఉందన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ అసోసియేషన్‌(యాంఫి) వార్షిక సదస్సు ముంబైలో జరిగింది. ఇందులో దీపక్‌ పరేఖ్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పొదుపు అలవాట్లన్నవి సంప్రదాయ బంగారం, రియల్‌ ఎస్టేట్‌ నుంచి ఆర్థిక సాధనాల వైపు మళ్లుతున్నాయని, ఈ ధోరణి మళ్లీ మారకపోవచ్చని, ఇది కూడా మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల పెరుగుదలకు దోహదపడుతుందని పరేఖ్‌ చెప్పారు.

‘‘ప్రస్తుతం  ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.24 లక్షల కోట్లు. ఎక్కువ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు(ఏఎంసీ) రానున్న ఐదేళ్లలో నిర్వహణ ఆస్తులు రెట్టింపు అవుతాయని అంచనా. అంటే నిర్వహణ ఆస్తులు రూ.50 లక్షల కోట్ల స్థాయికి చేరనున్నాయి’’ అని పరేఖ్‌ వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అధికారికం చేసేందుకు చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు, అందరికీ ఆర్థిక సేవలు, ఈక్విటీలకు ఈపీఎఫ్‌వో ఫండ్స్‌ కేటాయింపులు పెరగడం ఇవన్నీ కూడా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాకను పెంచేవేనన్నారు. 2016 మార్చికి రూ.12.3 లక్షల కోట్లుగా ఉన్న ఆస్తులు ఈ ఏడాది జూన్‌ నాటికి రూ.23 లక్షల కోట్లకు చేరాయి. ఫండ్స్‌ డిస్ట్రిబ్యూటర్ల కమీషన్‌ విషయంలో పారదర్శకత అవసరమని పరేఖ్‌ అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు