హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం 3,865 కోట్లు

25 Jan, 2017 00:41 IST|Sakshi
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం 3,865 కోట్లు

15 శాతం పెరుగుదల
బ్యాంక్‌ చరిత్రలో కనిష్ట వృద్ధి ఇదే

న్యూఢిల్లీ: ప్రైవేట్‌రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.3,865 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో లాభం(రూ.3,357 కోట్లు)తో పోల్చితే 15 శాతం వృద్ధి సాధించింది.  పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, ఫారిన్‌ కరెన్సీ డిపాజిట్ల ఉపసంహరణల కారణంగా మార్జిన్లు తగ్గడంతో నికర లాభం వృద్ధి నెమ్మదించిందని బ్యాంక్‌ డిప్యూటీ ఎండీ పరేశ్‌ సుక్తాంకర్‌ చెప్పారు. 300 కోట్ల డాలర్ల ఎన్నారై డిపాజిట్ల రిడంప్షన్‌ కారణంగా ఫారిన్‌ కరెన్సీ లోన్‌ బుక్‌ 200 కోట్ల డాలర్లు తగ్గడం మార్జిన్లపై ప్రభావం చూపిందన్నారు.   అయితే బ్యాంక్‌ చరిత్రలో అత్యంత తక్కువ వృద్ధి సాధించిన క్వార్టర్‌ ఇదే. రెండేళ్ల క్రితం వరకూ ఈ బ్యాంక్‌ ఎప్పుడూ నికర లాభంలో 30 శాతం వృద్ధిని సాధిస్తూ వచ్చేది. రెండేళ్ల క్రితం బ్యాంక్‌ నికర లాభం 20 శాతం స్థాయిలకు పడిపోయింది.

నికర వడ్డీ ఆదాయం 18 శాతం అప్‌..
మొత్తం ఆదాయం రూ.18,283 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.20,748 కోట్లకు పెరిగిందని సుక్తాంకర్‌ పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పెరుగుదలతో రూ.8,309 కోట్లకు ఎగసిందని తెలిపారు. 19% రుణ వృద్ది సాధించామని, నికర వడ్డీ మార్జిన్‌ 4.1%గా ఉందని పేర్కొన్నారు. నికర మొండి బకాయిలు 0.29% నుంచి 0.32%కి పెరిగాయని తెలిపారు. గత క్యూ3లో రూ.716 కోట్లుగా ఉన్న మొండిబకాయిల కేటాయింపులు 9 శాతం పెరిగి రూ.716 కోట్లకు చేరాయని వివరించారు. గత ఏడాది నవంబర్‌ 8 నాటి పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా బ్యాంక్‌ కరెంట్, సేవింగ్స్‌ ఖాతాల్లో నిల్వలు 37 శాతం పెరిగాయని  పేర్కొన్నారు. బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ 1.5 శాతం వృద్ధితో రూ.1,268 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు