హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాభం 4,601 కోట్లు

23 Jul, 2018 01:05 IST|Sakshi

ఆదాయం, లాభం 18% పెరుగుదల

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ అగ్రగామి అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎప్పటి మాదిరే తన వృద్ధి ప్రస్థానాన్ని జూన్‌ త్రైమాసికంలోనూ కొనసాగించింది. నికర లాభం 18.2 శాతం పెరిగి రూ.4,601 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 18.8 శాతం వృద్ధితో 26,367 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.3,893 కోట్లు, ఆదాయం రూ.22,185 కోట్లుగా ఉండడం గమనార్హం.

నికర వడ్డీ ఆదాయాన్ని గమనిస్తే... అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 9,370 కోట్ల నుంచి రూ.10,813 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ మార్జిన్‌ 4.2 శాతంగా ఉంది. స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో 1.33 శాతంగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 1.24 శాతం కాగా, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో ఇవి 1.30 శాతంగా ఉన్నాయి.

నికర ఎన్‌పీఏలు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 0.44 శాతం నుంచి 0.41శాతానికి తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో నికర ఎన్‌పీఏలు 0.40 శాతం. జూన్‌ త్రైమాసికంలో కేటాయింపులు 1,629 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.1,558 కోట్లు. బ్యాంకు మొత్తం బ్యాలన్స్‌ షీటు జూన్‌ చివరికి రూ.10,80,409 కోట్లు.

మరిన్ని వార్తలు