హెచ్‌డీఎఫ్‌సీ చేతికి అపోలో మ్యూనిక్‌ హెల్త్‌

20 Jun, 2019 11:10 IST|Sakshi

రూ. 1,347 కోట్ల డీల్‌

మెజారిటీ వాటాల కొనుగోలు

తొమ్మిది నెలల్లో ప్రక్రియ పూర్తి

ముంబై: గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా అపోలో మ్యూనిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలో మెజారిటీ వాటాలు దక్కించుకుంది. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ నుంచి రూ. 1,347 కోట్లకు ఈ వాటాలు కొనుగోలు చేస్తోంది. ఇకపై దీన్ని సొంత బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌లో విలీనం చేయనుంది. డీల్‌ ప్రకారం అపోలో హాస్పిటల్స్‌ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ రూ. 1,336 కోట్లకు 50.8 శాతం వాటాలు కొనుగోలు చేస్తుంది. మరో 0.4 శాతం వాటాను ఉద్యోగుల నుంచి రూ. 10.84 కోట్లకు కొనుగోలు చేస్తుంది. జాయింట్‌ వెంచర్‌ నుంచి వైదొలుగుతున్నందుకు గాను జర్మన్‌ బీమా సంస్థ మ్యూనిక్‌ హెల్త్‌.. అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్, అపోలో ఎనర్జీకి రూ. 294 కోట్లు చెల్లించనున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శోభనా కామినేని తెలిపారు. రుణభారం కొంత తగ్గించుకునేందుకు ఈ డీల్‌ తోడ్పడగలదని వివరించారు. 2006 నుంచి అపోలో మ్యూనిక్‌ హెల్త్‌లో అపోలో గ్రూప్‌ దాదాపు 300 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. షేరు ఒక్కింటికి రూ. 73 రేటు చొప్పున అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ప్రమోటర్లయిన ప్రతాప్‌ సి రెడ్డి కుటుంబానికి పెట్టుబడిపై దాదాపు నాలుగు రెట్లు అధికం లభించనుంది.

రూ. 10వేల కోట్ల మార్కెట్‌ వాటా..
మరోవైపు విలీన సంస్థకు నాన్‌–లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రంగంలో మొత్తం 6.4 శాతం మార్కెట్‌ వాటా, రూ. 10,807 కోట్ల వ్యాపార పరిమాణం, 308 శాఖలు ఉంటాయి. దేశీయంగా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో రెండో అతి పెద్ద ప్రమాద, వైద్య బీమా సంస్థగా ఆవిర్భవించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, అపోలో మ్యూనిక్‌ హెల్త్‌ల కలయిక.. మరింత వినూత్న ఉత్పత్తుల ఆవిష్కరణకు, నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి, సేవలు మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడగలదని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే తొమ్మిది నెలల వ్యవధిలో డీల్‌ పూర్తి కాగలదని చెప్పారు. విలీనానంతరం కూడా ఉద్యోగులందరినీ కొనసాగించనున్నట్లు వివరించారు. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో లిస్టింగ్‌ దిశగా ఈ కొనుగోలు తోడ్పడగలదని పరేఖ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు