హెచ్డీఎఫ్సీ- మ్యాక్స్ విలీనానికి ఓకే

1 Aug, 2017 21:28 IST|Sakshi
హెచ్డీఎఫ్సీ- మ్యాక్స్ విలీనానికి ఓకే

హెచ్‌డీఎఫ్‌సీ బోర్డు అనుమతి
త్వరలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ లిస్టింగ్

 ముంబై : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో మ్యాక్స్ బీమా సంస్థ విలీనానికి హెచ్‌డీఎఫ్‌సీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన డెరైక్టర్ల బోర్డ్ సమావేశం ఈ విలీనానికి ఆమోదం తెలిపిందని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. కాగా మ్యాక్స్ లైఫ్ పేరుతో మ్యాక్స్ ఫైనాన్షియల్ సంస్థ నిర్వహిస్తున్న జీవిత బీమా వ్యాపార విభాగం, హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన బీమా విభాగం, హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో విలీనం కానున్న విషయం తెలిసిందే. ఈ విలీనం వల్ల హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్ లై ఫ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ వాటా 42.5 శాతంగా ఉంటుంది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తమ అనుబంధ కంపెనీగా ఉండబోదని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్ చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది.

 రెండో విలీన ప్రతిపాదన
ఈ విలీనం కారణంగా  ఏర్పడే సంస్థ, ప్రైవేట్ రంగంలో అతి పెద్ద జీవిత బీమా సంస్థ కానుంది. ఈ సంస్థ మొత్తం ప్రీమియం రూ.26,000 కోట్లకు, నిర్వహణ ఆస్తులు రూ.లక్ష కోట్లకు పైగా ఉంటాయని అంచనా. ప్రైవేట్ జీవిత బీమా రంగంలో ఒక్క ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు మాత్రమే రూ.లక్ష కోట్ల నిర్వహణ ఆస్తులు ఉన్నాయి. కాగా హెచ్‌డీఎఫ్‌సీకి ఈ ఏడాది ఇది రెండో విలీన ప్రతిపాదన. ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌లో వంద శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు