హెచ్‌డీఎఫ్‌సీ లాభం 2,729 కోట్లు

31 Jan, 2017 00:27 IST|Sakshi
హెచ్‌డీఎఫ్‌సీ లాభం 2,729 కోట్లు

ముంబై: హౌసింగ్‌ ఫైనాన్స్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌)  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 13 శాతం వృద్ధి చెంది రూ.2,729 కోట్లకు పెరిగింది. రుణ వృద్ధి బాగా ఉండడం, అధిక మార్జిన్ల కారణంగా మొండి బకాయిలు స్వల్పంగా పెరిగినా, మంచి నికర లాభం సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ వివరించింది. గత క్యూ3లో రూ.12,254 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ3లో రూ.14,981 కోట్లకు పెరగిందని కంపెనీ వైస్‌ చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రి చెప్పారు.

స్వల్పంగా పెరిగిన మొండి బకాయిలు....
స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర లాభం 12 శాతం వృద్ధితో రూ.1,701 కోట్లకు,  ఆదాయం రూ.8,137 కోట్లకు పెరిగాయని మిస్త్రీ తెలిపారు. . గత క్యూ3లో నికర లాభం రూ.1,521 కోట్లుగా, ఆదాయం రూ.7,268 కోట్లని వివరించారు. స్థూల మొండి బకాయిలు 0.72 శాతం నుంచి రూ.0.81 శాతానికి పెరిగాయని పేర్కొంది. ఈ క్యూ3లో స్థూల మొండి బకాయిలు రూ.2,341 కోట్లకు చేరాయని వివరించారు. మొత్తం రుణాల్లో 70 శాతానికి పైగా ఉన్న వ్యక్తిగత రుణాల్లో  మొండి బకాయిలు స్వల్పంగా పెరిగాయని పేర్కొన్నారు. మొండి బకాయిలు వ్యక్తిగత రుణాల్లో 0.65 శాతానికి, ఇతర రుణాల్లో 1.16 శాతానికి పెరిగాయని తెలిపారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో బకాయిలకు చెల్లింపులకు ఆర్‌బీఐ ఇచ్చిన గ్రేస్‌ పీరియడ్‌ను పరిగణనలోకి తీసుకోలేదని, అందుకే మొండి బకాయిలు అధికంగా ఉన్నాయని వివరించారు. వ్యక్తిగత రుణాలు 23 శాతం, నిర్వహణ ఆస్తులు 17% చొప్పున వృద్ధి సాధించాయని వివరించారు. మొండి బకాయిలకు కేటాయించిన రూ.705 కోట్లతో కలుపుకొని మొత్తం కేటాయింపులు రూ.3,198 కోట్లకు చేరాయని పేర్కొన్నారు.

రెండు నెలల్లో సాధారణ స్థాయికి...
పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం మొండి బకాయిలు పెరగడానికి ఒక కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వాణిజ్య రుణాల్లో నోట్ల రద్దు ప్రభావం లేదని పేర్కొన్నారు. రెండు నెలల్లో పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయని వివరించారు. చిన్న రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వడ్డీ రాయితీ ఫలితాలు ఈ క్వార్టర్‌ నుంచి కనిపిస్తాయని వివరించారు.

రూ.35వేల కోట్ల నిధుల సమీకరణ...
వ్యాపార విస్తరణ నిమిత్తం నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.35,000 కోట్లు సమీకరించనున్నామని మిస్త్రీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకుS సంబంధించి కంపెనీ నికర లాభంలో అనుబంధ సంస్థల వాటా 32%గా ఉందని వివరించారు. గత ఏడాది డిసెంబర్‌ నాటికి లోన్‌ బుక్‌ రూ.2,86,876 కోట్లకు చేరాయని తెలిపారు.

ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ స్వల్పంగా పెరిగి రూ.1,369కు పెరిగింది.

మరిన్ని వార్తలు