హెచ్‌డీఎఫ్‌సీ లాభం 4,342 కోట్లు 10 శాతం డౌన్‌

26 May, 2020 03:32 IST|Sakshi

ఒక్కో షేర్‌కు రూ.21 డివిడెండ్‌

న్యూఢిల్లీ: హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.4,811 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.4,342 కోట్లకు తగ్గింది.  రూ. 2 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.21 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కంపెనీ వైస్‌ చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ తెలిపారు. కరోనా కోసం కేటాయింపులు, ఇంకా ఇతర  కారణాల రీత్యా గతం, ఇప్పటి ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించారు. ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు...

► స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, నికర లాభం రూ.2,862 కోట్ల నుంచి 22 శాతం క్షీణించి రూ.2,233 కోట్లకు చేరింది.  
► నికర వడ్డీ ఆదాయం రూ.3,161 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.3,780 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.3 శాతం నుంచి 3.4 శాతానికి పెరిగింది.  
► డివిడెండ్‌ ఆదాయం రూ.537 కోట్ల నుంచి రూ.2 కోట్లకు, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై లాభాలు రూ.321 కోట్ల నుంచి రూ.2 కోట్లకు తగ్గాయి.  
► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, స్టాండ్‌అలోన్‌ నికర లాభం దాదాపు రెట్టింపైంది. 2018–19లో రూ.9,632 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.17,770 కోట్లకు ఎగసింది.  
► నగదు నిల్వలు రూ.6,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెరిగాయి. కరోనా కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుండటంతో ఈ కంపెనీ లిక్విడిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే నగదు నిల్వలు భారీగా పెంచుకుంది.  
► కేటాయింపులు రూ.935 కోట్ల నుంచి రూ.5,913 కోట్లకు ఎగిశాయి.  
► ఈఏడాది మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు రూ.8,908 కోట్లు(1.99 శాతం)గా ఉన్నాయి. దీంట్లో వ్యక్తిగత రుణాలు 0.95 శాతంగా, వ్యక్తిగతేతర రుణాలు 4.71 శాతంగా ఉన్నాయి.  
► ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం రుణాలు 11% వృద్ధితో రూ.4.50 లక్షల కోట్లకు పెరిగాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు