పెద్దలకూ హెల్త్‌ పాలసీ

15 Jul, 2019 05:16 IST|Sakshi

 ప్రీమియం మాత్రం ఖరీదు

అయినా సరే తీసుకోవడమే సురక్షితం

అప్పటికే ఉన్న వ్యాధులకూ కవరేజీ

కాకపోతే పరిమితులు ఎక్కువ

కో–పేమెంట్, రూమ్‌రెంట్‌ క్యాప్‌ గమనించాలి

పాలసీ లేకపోతే ఆర్థికంగా బోలెడు భారం

చెన్నైకి చెందిన సుమీత్‌ (60) ఇటీవలే పదవీ విరమణ చేశాడు. ప్రైవేటు రంగంలో పనిచేసినంత కాలం సంస్థ తరఫున గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అతడి కుటుంబ సభ్యుల అవసరాలను ఆదుకుంది. కానీ, ఉద్యోగానికి విరామం తీసుకోవడంతో ఇకపై తనకు హెల్త్‌ కవరేజీ ఉండదన్న విషయం తెలుసుకుని అతడు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. పోనీ, ఈ వయసులో హెల్త్‌ పాలసీ తీసుకుందామనుకున్నా... అతి సాధ్యమేనా? అన్నది అతడి సందేహం. అప్పటికే సుమీత్‌కు అధిక రక్తపోటు సమస్య కూడా ఉంది. ఈ పరిస్థితి సుమీత్‌ ఒక్కడికే కాదు... ఎంతో మందికి ఎదురయ్యేదే. కానీ, పరిస్థితులు మారాయి. సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్‌ పాలసీలను నేడు ఎన్నో కంపెనీలు అందిస్తున్నాయి. కాకపోతే, ఏ పాలసీ తీసుకోవాలన్నది తేల్చుకోవాలంటే, వాటికి సంబంధించి అన్ని అంశాలనూ తెలుసుకోవాలి. వాటిని తెలియజేసే ఆరోగ్య కథనమే ఇది.  

ఖరీదైనా సరే...
సాధారణ పాలసీలు అయితే వయసురీత్యా ప్రవేశానికి పరిమితులు ఉంటున్నాయి. ఈ పాలసీలను 60–65 ఏళ్ల తర్వాత తీసుకోవడం కష్టమే. అదే సీనియర్‌ సిటిజన్‌ పాలసీలు అయితే, ఏ ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. ‘‘మా సీనియర్‌ సిటిజన్‌ పాలసీ చాలా పెద్ద వయసులో అంటే 65–74 మధ్యనున్న వారు కూడా తీసుకోవచ్చు’’ అని స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ జాయింట్‌ ఎండీ ఎస్‌.ప్రకాష్‌ తెలిపారు. అయితే, పెద్ద వయసులో లభించే హెల్త్‌ పాలసీల ప్రీమియం చౌకగా మాత్రం ఉండదు. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ‘‘కాస్త చిన్న వయసులోనే పాలసీ తీసుకుంటే నో క్లెయిమ్‌ బోనస్‌ ప్రయోజనం లభిస్తుంది.

ముందస్తు వ్యాధుల కవరేజీ కోసం వారు వేచి ఉండాల్సిన ఇబ్బంది తప్పుతుంది’’ అని జేఎల్‌టీ ఇండిపెండెంట్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ లీడ్‌ పార్ట్‌నర్‌ అర్హత్‌గోటడ్కే తెలిపారు.  అయితే, ప్రీమియం ఎక్కువైనా కానీ సీనియర్‌ సిటిజన్లు అనారోగ్యం కారణంగా ఆర్థికంగా గుల్ల కాకుండా ఉండేందుకు హెల్త్‌ పాలసీ తీసుకోడమే సరైనదన్నది నిపుణులు ఇచ్చే సలహా. ప్రీమియం రూ.25,000– 30,000 ఖరీదుగా భావించొచ్చు.  అత్యవసర నిధి కలిగి ఉన్న వారు సైతం హెల్త్‌ పాలసీ తీసుకోవడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ఏదైనా పెద్ద వ్యాధి బారిన పడితే మీ మొత్తం నిధి అంతా కరిగిపోవచ్చు. అందువల్ల పెద్దలకు పాలసీనే ఎంతో శ్రేయస్కరమని నిపుణుల సూచన.

అపోహలు
అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులకు హెల్త్‌ పాలసీలు లభించడం కష్టమని చాలా మంది భావిస్తుంటారు. కష్టమైనా కానీ, హెల్త్‌ కవరేజీ పొందడం అసాధ్యమేమీ కాదని బ్యాంక్‌ బజార్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ నవీన్‌ చందాని అన్నారు. వేతన జీవుల్లో ఎక్కువ మంది సాధారణంగా తమ వృద్ధులైన తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా పాలసీ తీసుకోరు. గ్రూపు హెల్త్‌ పాలసీలో వారికి కూడా కవరేజీ ఉండడం వల్లే అలా చేస్తుంటారు. ‘‘కార్పొరేట్‌ హెల్త్‌ కవరేజీ రూ.2–5 లక్షలకు మించదు. కనుక ఇది సరిపోదు. ఒకవేళ ఉద్యోగం కోల్పోయినా లేక ఉద్యోగం వీడి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఏం చేస్తారు?’’ అని ప్రశ్నించారు బత్వాల్‌. అలాగే, వృద్ధులు తమ దృష్టికి వచ్చిన హెల్త్‌పాలసీ తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు.

అయితే, అలా చేయడానికి ముందు అందులో ఉన్న ప్రయోజనాలు, మినహాయింపులు అన్నింటినీ తెలుసుకోవాలన్నది నిపుణుల సూచన. ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉంటున్నాయని, అన్నింటినీ పరిశీలించిన తర్వాతే తమకు అనువైన పాలసీని ఎంచుకోవాలని సూచిస్తున్నారు.  పెద్ద వయసులో తీసుకునే పాలసీలో ముఖ్యంగా చూడాల్సినది బీమా కవరేజీ మొత్తం పెంచుకోవడానికి అవకాశం ఉందా? అని. పైలట్‌ పాలసీ కాకుండా పూర్తి స్థాయి పాలసీ తీసుకోవాలి. అప్పటికే ఉన్న వ్యాధుల కవరేజీకి ఎంత కాలం వేచి ఉండాలన్నది కూడా పరిశీలించాలి. ‘‘ఇది 18 నెలల నుంచి నాలుగేళ్ల వరకు ఉంటుంది. తక్కువ వెయిటేజీ పీరియడ్‌ ఉన్న పాలసీని ఎంచుకోవాలి’’ అని సింబో ఇన్సూరెన్స్‌ సీఈవో అనిక్‌ జైన్‌ సూచించారు. ఇక సీనియర్‌ సిటిజన్‌ పాలసీల్లో కోపేమెంట్‌ (క్లెయిమ్‌లో పాలసీదారులు తమ వంతు వెచ్చించాల్సిన మొత్తం) ఎక్కువగా ఉంటుంది. ‘‘10 శాతం కోపేమెంట్‌ అయితే ఫర్వాలేదు. 30 శాతం అయితే చాలా కష్టమవుతుంది’’ అని జైన్‌ అన్నారు.

అన్ని వివరాలు వెల్లడించడమే మేలు

హెల్త్‌ పాలసీకి దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ఓ పేపర్‌పై మీకున్న ఆరోగ్య సమస్యల వివరాలన్నీ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత హెల్త్‌పాలసీ ప్రపోజల్‌ ఫామ్‌లో ఆ వివరాలన్నింటినీ వెల్లడించడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే పూర్తి వివరాలు వెల్లడించకపోవడం క్లెయిమ్‌లు తిరస్కరణకు కారణమవుతున్న వాటిల్లో ముఖ్యమైనది. పాలసీ పత్రంలోని అన్ని నియమ, నిబంధనలు, షరతులను పూర్తిగా చదవడం మంచిది.

ప్రపోజల్‌ తిరస్కరణ
సీనియర్‌ సిటిజన్‌ పాలసీల్లో ప్రపోజల్‌ తిరస్కరణ ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ ఒక కంపెనీ పాలసీ ప్రపోజల్‌ను తిరస్కరిస్తే, మరో కంపెనీ నుంచి పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ, ఈ వయసులో రాదులేనన్న అపోహతో ఆగిపోవద్దు. ఎందుకంటే ఒక్కో కంపెనీకి భిన్నమైన అండర్‌రైటింగ్‌ విధానాలు ఉండొచ్చు. ఒక కంపెనీ రిస్కీ ప్రపోజల్‌ను కాదనుకుంటే, మరో బీమా కంపెనీ అదే తరహా రిస్కీ కేసులకు పాలసీలను జారీ చేయవచ్చు. ఒకవేళ విడిగా పాలసీ పొందలేకపోతే, అప్పుడు బ్యాంకు ఖాతాదారునిగా గ్రూపు హెల్త్‌ పాలసీ కోసం ప్రయత్నించొచ్చని జైన్‌ సూచించారు.  ఏ మార్గంలోనూ పాలసీ లభించని వారి ముందున్న మార్గం వైద్య అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడమే.

మరిన్ని వార్తలు