ఆరోగ్య బీమాకూ ఫ్రీ లుక్ పీరియడ్

25 Jan, 2015 01:54 IST|Sakshi
ఆరోగ్య బీమాకూ ఫ్రీ లుక్ పీరియడ్

కంపెనీలకు ఐఆర్‌డీఏ ఆదేశాలు
జీవిత బీమా పాలసీ తీసుకునే వారెవరికైనా ఓ వెసులుబాటు ఉంటుంది. పాలసీ ఆరంభించడానికి ముందు 15 రోజుల పాటు ‘ఫ్రీ లుక్ పీరియడ్’ అమల్లో ఉంటుంది. అంటే ఈ సమయంలో గనక మనకు ఆ పాలసీ వద్దనుకుంటే బీమా కంపెనీకి చెప్పి ఎలాంటి రుసుమూ చెల్లించకుండానే వైదొలగవచ్చు. కానీ ఇప్పటిదాకా ఆరోగ్య బీమాకు ఈ ఫ్రీ లుక్ పీరియడ్ లేదు. కానీ బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ ఆదేశాలతో ఇకపై ఆరోగ్య బీమాకూ దాన్ని వర్తింపజేయనున్నాయి కంపెనీలు.
 
కాకపోతే ఆరోగ్య బీమా విషయంలో జీవిత బీమాలా కాకుండా ఓ చిన్న చిక్కుంటుంది. బీమా పాలసీని తీసుకునేటపుడు పాలసీదారుకు అవసరమైన వైద్య పరీక్షలన్నీ కంపెనీయే చేయిస్తుంది. దీనికయ్యే ఖర్చును కూడా కంపెనీయే భరిస్తుంది. మరి ఒకవేళ పాలసీదారు ఈ పరీక్షలన్నీ అయ్యాక... ఫ్రీ లుక్ పీరియడ్‌లో పాలసీ గనక తీసుకోనని చెబితే ఏం చేయాలి? అలా చేస్తే కంపెనీలకు ఇబ్బంది కదా!!

ఈ దిశగా ఆలోచించిన ఐఆర్‌డీఏ... ఆరోగ్య పరీక్షల నిమిత్తం కొంత మొత్తాన్ని వసూలు చేసే హక్కు బీమా కంపెనీకి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ పాలసీ అమల్లోకి వచ్చిన తరవాత గనక పాలసీదారు వైదొలగాలని అనుకుంటే... అప్పటిదాకా వర్తించిన కాలానికి సంబంధించి కొంత రుసుమును కంపెనీలు ఎలాగూ తీసుకుంటాయి. అదీ కథ.

మరిన్ని వార్తలు