టెలికం కంపెనీలకు భారీ ఊరట

8 Mar, 2018 04:28 IST|Sakshi

 స్పెక్ట్రమ్‌ చెల్లింపులకు మరింత సమయం

 ఉపశమన ప్యాకేజీకి కేంద్రం ఆమోదం  

న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న టెలికం రంగానికి ఉపశమనం కల్పించే ప్యాకేజీకి కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిన కంపెనీలు అందుకు సంబంధించిన ఫీజు చెల్లింపులకు మరింత వ్యవధి ఇవ్వడం ఇందులో ప్రధానమైంది. అలాగే, స్పెక్ట్రమ్‌ హోల్డింగ్‌ గరిష్ట పరిమితిని కూడా సరళీకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్‌ మంత్రిత్వ శాఖల బృందం చేసిన సిఫారసుల మేరకు ఈ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. టారిఫ్‌ల క్షీణతతో లాభాలు అడుగంటిపోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న టెలికం రంగంపై అధ్యయనానికి కేంద్రం పలు శాఖలతో కూడిన అధికారులతో కమిటీని గతేడాది ఏర్పాటు చేసింది.

స్పెక్ట్రమ్‌ ఫీజుల చెల్లింపునకు 10 ఏళ్లుగా ఉన్న గడువును 15 ఏళ్లకు పెంచాలని ఈ కమిటీ సిఫారసు చేయగా దానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దేశీయ టెలికం రంగం ప్రస్తుతం రూ.4.6 లక్షల కోట్ల రుణభారాన్ని మోస్తోంది. చెల్లింపులకు అదనపు సమయం ఇవ్వడం వల్ల వాటికి నిధుల లభ్యత పెరుగుతుందని, స్పెక్ట్రమ్‌ పరిమితిని సరళీకరించడం వల్ల స్థిరత్వం ఏర్పడి భవిష్యత్తు స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనేందుకు ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు