ఇంకా.. ఇంకా.. ఏం కావాలంటే!

22 Jan, 2020 03:01 IST|Sakshi

పన్నుల భారం తగ్గించాలి..

ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి

ఎకానమీకి మరింత ఊతమిచ్చే చర్యలు కావాలి

రాబోయే బడ్జెట్‌పై అంచనాలు ఇవీ...

నానాటికీ పడిపోతున్న జీడీపీ వృద్ధి.. కొండలా పెరిగిపోతున్న ద్రవ్య లోటు.. లేదు లేదని సర్ది చెప్పుకుంటున్నా వెంటాడుతున్న మందగమన భయాలు.. 45 ఏళ్ల గరిష్టానికి ఎగిసిన నిరుద్యోగిత రేటు..  ఒకటా రెండా.. మోదీ 2.0 రెండో రౌండ్‌లో పరిస్థితి మామూలుగా లేదు. ఏం చేస్తే ఎకానమీ గట్టెక్కుతుందో పాలుపోని పరిస్థితిలో సర్కార్‌ కొట్టుమిట్టాడుతోంది. సంస్కరణలెన్ని ప్రవేశపెడుతున్నా.. స్టాక్‌ మార్కెట్లు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌ల్లో పైకి ఎగబాకేందుకు ఉపయోగపడుతున్నాయే తప్ప.. క్షేత్ర స్థాయిలో ఎకానమీ దౌడు తీసేలా ఊతం లభిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

అటు ఆర్థిక మంత్రి.. ఇటు ప్రధాని ఎడాపెడా పరిశ్రమవర్గాలతో సమావేశాలు జరుపుతున్నారు. 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్‌ను నిలబెడతామంటూ పదేపదే చెబుతున్న మోదీ సర్కారు అందుకు తగిన కార్యాచరణను ప్రకటిస్తుందా? ఈ చిక్కుముడులన్నింటికీ  ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే 2020–21 బడ్జెట్‌ సమాధానమిస్తుందా? బడ్జెట్‌పై వివిధ వర్గాల ఆశలు.. డిమాండ్లు, సూచనలతో నేటి నుంచి ‘సాక్షి బిజినెస్‌’ కౌంట్‌డౌన్‌...

సామాన్యులు.. వేతన జీవులు.. 
టీవీలు, ఫ్రిజ్‌లు, కార్లు మొదలైనవన్నీ కూడా తమ భవిష్యత్‌ ఆదాయ అంచనాల ప్రాతిపదికన, రుణాల మీద తీసుకునే వారే ఎక్కువగా ఉంటారు. అయితే, కొన్నాళ్లుగా మందగమనాన్ని సూచిస్తూ.. బిస్కెట్లు మొýlలుకుని కార్ల దాకా అనేక ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా తగ్గినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధికి చోదకాలైన వేతన జీవులు, మధ్యతరగతి వర్గాలపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పన్ను రేట్లను తగ్గించడం ద్వారా వారి చేతుల్లో మరికాస్త మిగిలించగలిగితే, వినియోగం పెరగడానికి ఊతం లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కార్పొరేట్‌ ఆదాయ పన్ను రేటుకు రెట్టింపు స్థాయిలో వ్యక్తిగత ఆదాయ పన్ను రేటు గరిష్టంగా 43 శాతంగా ఉన్నందున.. రెండింటి మధ్య భారీ వ్యత్యాసాలను తగ్గించేందుకు సత్వర చర్యలు అవసరమన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. 

గ్రామీణ ఎకానమీ...
పంటలకు మెరుగైన ధర కల్పించాలని, రుణాలు రద్దు చేయాలని గడిచిన రెండేళ్లుగా పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లో ఉన్నన్నాళ్లూ.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల ఆదాయాలు ఒకే స్థాయిలో స్థిరపడిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు మందగించడం వల్ల ఆ రంగంలో కూలీలు కూడా ప్రత్యామ్నాయంగా వ్యవసాయ రంగంవైపు మళ్లుతుండటంతో కూలీల సంఖ్య పెరిగిపోయి.. డిమాండ్‌ తగ్గిందన్నది నిపుణుల విశ్లేషణ. దీనితో సహజంగానే రేటూ తగ్గి, వారు ఇతరత్రా జరిపే వ్యయాలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయదారులు, కూలీల ఆదాయాలు మరింత మెరుగుపడే దిశగా బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉండాలని కోరుకుంటున్నారు.

జీడీపీ నేలచూపులు.. 
డిమాండ్, తయారీ, పెట్టుబడులు.. అన్నీ మందగించిన నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నానాటికీ పడిపోతోంది. భారత్‌.. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీని పోగొట్టుకుంది. జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఏకంగా ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5%కి క్షీణించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద కనాకష్టంగా 5% ఉండొచ్చని అంచనా.

ద్రవ్యలోటు..పోటు.. 
గత బడ్జెట్‌లో ద్రవ్య లోటును స్థూల దేశీయోత్పత్తిలో 3.3 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కానీ ఇది 3.7 శాతం నుంచి 4 శాతం దాకా ఉండొచ్చని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి గర్గ్‌ ఇటీవలే పేర్కొన్నారు. తగ్గిన ఆదాయాలు, బడ్జెట్‌యేతర వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది ఏకంగా 5.5 శాతం దాకా కూడా ఎగియొచ్చన్న అంచనాలూ ఉన్నాయి.

2019–20లో రూ. 13 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల టార్గెట్‌ పెట్టుకుంటే నవంబర్‌ నాటికి కేవలం రూ. 5 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక సెంట్రల్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ. 5.26 లక్షల కోట్ల టార్గెట్‌ కాగా.. నవంబర్‌ ఆఖరు నాటికి వచ్చినది... రూ. 3.26 లక్షల కోట్లే. డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా సమీకరణ కూడా లక్ష్యంగా పెట్టుకున్న దానికన్నా  40% తగ్గొచ్చని అంచనా.

ఎగుమతులు ..డీలా.. 
ఎగుమతులు వరుసగా నాలుగో నెలా నవంబర్‌లో క్షీణించాయి. 2018–19 ఏప్రిల్‌– నవంబర్‌ మధ్య ఎగుమతుల విలువ 216.23  బిలియన్‌ డాలర్లు కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం అదే వ్యవధిలో 211.93 బిలియన్‌ డాలర్లే.

పెట్టుబడులకు ఊతం.. 
వ్యాపార సంస్థలు మరింతగా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉంటాయని అంచనా. ఉద్యోగాల కల్పనకు అత్యధికంగా అవకాశాలున్న రంగాల కంపెనీలకు పన్నుపరమైన మినహాయింపులు, ప్రోత్సాహకాలు కల్పించవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా నాలుగు అంశాల చుట్టూ ఈ బడ్జెట్‌ తిరగవచ్చని భావిస్తున్నారు. అవి..

ఉద్యోగాల కల్పన... 
ప్రతి నెలా దాదాపు 12 లక్షల పైచిలుకు యువ జనాభా.. జాబ్‌ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. కానీ వారికి ఉద్యోగావకాశాలు కల్పించడమే కష్టతరంగా మారింది. మోదీ ప్రభుత్వ హయాంలో అత్యంత భారీ వైఫల్యం ఇది కూడానంటూ విపక్షాలు సమయం చిక్కినప్పుడల్లా దండెత్తుతున్నాయి. ఆటోమేషన్‌ వంటి టెక్నాలజీల కారణంగా కొన్ని రంగాల్లో ఉద్యోగాల్లో కోత పడుతుండగా.. మరికొన్ని రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఏయే రంగాల్లో అర్థవంతమైన రీతిలో ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశముందో ప్రభుత్వం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

>
మరిన్ని వార్తలు