‘హీరో’ లాభం 25 శాతం డౌన్‌ 

27 Apr, 2019 00:26 IST|Sakshi

రూ.730 కోట్లకు నికర లాభం 

8 శాతం తగ్గి రూ.7,885 కోట్లకు ఆదాయం 

ఒక్కో షేర్‌కు రూ.32 డివిడెండ్‌ 

ఈ ఆర్థిక సంవత్సరమూ అంతంత మాత్రమే 

హీరో మోటోకార్ప్‌ చైర్మన్‌ వ్యాఖ్య  

న్యూఢిల్లీ: టూవీలర్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 25 శాతం తగ్గి రూ.730 కోట్లకు చేరింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యు4లో రూ.967 కోట్ల నికర లాభం వచ్చిందని హీరో మోటోకార్ప్‌ చైర్మన్‌ పవన్‌ ముంజల్‌ పేర్కొన్నారు. గత క్యూ4లో అమ్మకాలు తగ్గడంతో నికర లాభం కూడా తగ్గిందని, ఆదాయం రూ.8,564 కోట్ల నుంచి 8 శాతం పతనమై రూ.7,885 కోట్లకు తగ్గిందని తెలిపారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో 20 లక్షల వాహనాలు విక్రయించగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో 17.8 లక్షల వాహనాలు విక్రయించామని, అమ్మకాలు 11 శాతం తగ్గాయని తెలిపారు. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.32 డివిడెండ్‌ను ప్రకటించారు. కాగా ఈ ఏడాది జనవరి 31న ఒక్కో షేర్‌కు రూ.55 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.  

78 లక్షల వాహన విక్రయాలు.. 
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,697 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం తగ్గి రూ.3,385 కోట్లకు చేరింది. ఆదాయం మాత్రం రూ.32,872 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.33,651 కోట్లకు పెరిగింది. వాహన విక్రయాలు రూ.75.87 లక్షల నుంచి 78.20 లక్షలకు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, రికార్డు విక్రయాలు సాధించామని ముంజల్‌ వ్యాఖ్యానించారు. మార్కెట్లో ఇబ్బందులున్నా, అగ్రస్థానాన్ని కొనసాగించామన్నారు.  

కష్టాలు కొనసాగుతాయ్‌..... 
దేశీయ మార్కెట్లో సమీప భవిష్యత్తులో కష్టాలు కొనసాగుతాయని ముంజల్‌ పేర్కొన్నారు. పండుగల సీజన్‌లో అమ్మకాలు పుంజుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)–6 ప్రమాణాలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తాయని, ఈ నిబంధనలు పాటించే బైక్‌లను, స్కూటర్లను అంతకంటే ముందే మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. అయితే బీఎస్‌ సిక్స్‌ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, ఈ నిబంధనల కారణంగా వాహన పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా సమస్యాత్మకమేనని పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయన్న అంచనాలతో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 0.5 శాతం నష్టంతో రూ.2,604 వద్ద ముగిసింది.   

మరిన్ని వార్తలు