హీరో మోటో రూ.5,000 కోట్ల పెట్టుబడులు

21 Oct, 2014 00:50 IST|Sakshi
హీరో మోటో రూ.5,000 కోట్ల పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కొత్త ప్లాంట్లు...
ఒక్కో ప్లాంట్‌పై 1,600 కోట్ల వ్యయం
కొలంబియా, బంగ్లాదేశ్‌లలోనూ ప్లాంట్ల ఏర్పాటు...
కంపెనీ ఎండీ పవన్ ముంజాల్ వెల్లడి


నీమ్‌రానా(రాజస్థాన్): దేశీ ద్విచక్రవాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ రూ.5,000 కోట్ల భారీ పెట్టుబడులను వెచ్చించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి సామర్థ్య విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని... కొలంబియా, బంగ్లాదేశ్‌లలోనూ తయారీ ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ పవన్ ముంజాల్ చెప్పారు. రాజస్థాన్‌లోని కుకాస్‌లో గ్లోబల్ పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని(ఆర్‌అండ్‌డీ) కూడా నెలకొల్పనున్నట్లు తెలిపారు. కొలంబియా ప్లాంట్‌లో పనులు ఇప్పటికే మొదలయ్యాయని.. బంగ్లాదేశ్‌లో త్వరలో ప్రారంభించనున్నట్లు ముంజాల్ వివరించారు. సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

2020కల్లా హీరో మోటో మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 12 మిలియన్ యూనిట్లకు చేర్చాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఈ పెట్టుబడి ప్రణాళికలను అమలుచేస్తున్నట్లు ముంజాల్ తెలిపారు. కంపెనీ నాలుగవ ప్లాంట్‌ను మంగళవారం ఇక్కడ లాంఛనంగా ప్రారంభించనుంది. దీని వార్షిక సామర్థ్యం 7,50,000 యూనిట్లు. దీంతో కంపెనీ మొత్తం సామర్థ్యం ఏటా 7.65 మిలియన్ యూనిట్లను అందుకోనుంది. ఇక్కడ హీరో మోటో రూ.1,000 కోట్ల పెట్టుబడిపెట్టింది.

గుజరాత్ ప్లాంట్ పనులు వచ్చే నెలలో...
గుజరాత్‌లోని హాలోల్‌లో నిర్మించతలపెట్టిన అయిదో ప్లాంట్ పనులు వచ్చే నెలలో మొదలవుతాయని.. ఆ వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ ప్లాంట్(ఆరవది) నిర్మాణంపై దృష్టిపెట్టనున్నట్లు ముంజాల్ చెప్పారు. ఈ 2 కొత్త ప్లాంట్‌లపై చెరో రూ.1,600 కోట్ల చొప్పున వెచ్చించనున్నట్లు తెలిపారు. కాగా, గుజరాత్ ప్లాంట్ వార్షిక తయారీ సామర్థ్యం 1.8 మిలియన్ యూనిట్లు.. ఏపీ ప్లాంట్ సామర్థ్యం 1.8-2 మిలియన్ యూనిట్లు ఉంటుందన్నారు.

కొలంబియా ప్లాంట్‌లో రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌లో రూ.100 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. ఇక్కడ కంపెనీ చెరో 1.5 మిలియన్ వార్షిక సామర్థ్యంగల ప్లాంట్‌లను నెలకొల్పుతోంది. ఇక కుకాస్‌లో ఏర్పాటుచేసే ఆర్‌అండ్‌డీ కేంద్రానికి రూ.653 కోట్ల మొత్తాన్ని వెచ్చించాలని భావిస్తున్నట్లు ముంజాల్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు