కాంకర్ ఆఫర్ కు సంస్థల భారీ స్పందన

10 Mar, 2016 01:26 IST|Sakshi
కాంకర్ ఆఫర్ కు సంస్థల భారీ స్పందన

నేడు రిటైల్ ఇన్వెస్టర్ల వాటా విక్రయం
న్యూఢిల్లీ: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాంకర్) వాటా విక్రయం మొదటి రోజు శుభారంభం చేసింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసిన షేర్లకు రెట్టింపు బిడ్డింగ్‌లు వచ్చాయి. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో ఒక్కో షేర్‌ను రూ.1,195 ధరకు  ప్రభుత్వం కాంకర్‌లో 5 శాతం వాటా(97,48,710 షేర్ల)ను విక్రయిస్తోంది. ఈ ధరకు ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.1,165 కోట్లు సమకూరుతాయని అంచనా. ఈ 5 శాతం వాటా విక్రయంలో సంస్థాగత ఇన్వెస్టర్లకు 77.8 లక్షల షేర్లను కేటాయించగా, రూ.1,887 కోట్ల విలువైన 1.57 కోట్ల షేర్లకు ( 2.02 రెట్లు అధికంగా) బిడ్‌లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల ప్రమేయం లేకుండా అంచనా వేసిన రూ.1,165 కోట్ల కంటే అధికంగా బిడ్‌లు రావడం విశేషం. అన్ని వర్గాల సంస్థాగత ఇన్వెస్టర్లు జోరుగా బిడ్‌లు వేశారని డిజిన్వెస్ట్‌మెంట్  కార్యదర్శి గుప్తా పేర్కొన్నారు. ఎఫ్‌ఐఐలు 40%, ఎల్‌ఐసీ, ఇతర ప్రైవేట్ బీమా కంపెనీలు 125 %, మ్యూచువల్ ఫండ్స్ 30 శాతానికి బిడ్‌లు వేశాయని, బ్యాంక్‌లు మాత్రం 1 శాతానికే బిడ్‌లు సమర్పించాయని వివరించారు.

 రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్
ఇక ఈ 5 శాతం వాటా విక్రయంలో రిటైల్ ఇన్వెస్టర్లకు 19.4 లక్షల షేర్లను కేటాయించారు. ఈ షేర్ల విక్రయం నేడు(గురువారం) జరగనున్నది. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న ధరలో(రూ.1,195) 5 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుందని గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బీఎస్‌ఈలో కాంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్ 2.5 శాతం నష్టపోయి రూ.1,196 వద్ద ముగిసింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం విక్రయిస్తున్న ఏడో ప్రభుత్వ రంగ వాటా విక్రయం ఇది. రైల్వేల నిర్వహణలో ఉన్న కంటైనర్ కార్పొరేషన్‌లో ప్రభుత్వ వాటా 61.8 శాతంగా ఉంది. ఈ 5 శాతం వాటా విక్రయం తర్వాత ప్రభుత్వ వాటా 56.80 శాతానికి తగ్గుతుంది.

>
మరిన్ని వార్తలు