హెటిరో ‘కోవిఫర్‌’ ధర రూ.5,400

25 Jun, 2020 03:49 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ హెటిరో.. కోవిడ్‌–19 చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ ఔషధం ‘కోవిఫర్‌’ ధరను రూ.5,400గా నిర్ణయించింది. ముందుగా 20,000 వయల్స్‌ను అందించనున్నట్టు కంపెనీ బుధవారం తెలిపింది. వీటిలో 10,000 వయల్స్‌ హైదరాబాద్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు వెంటనే సరఫరా చేస్తున్నట్టు ప్రకటించింది. మరో 10,000 వయల్స్‌ను కోల్‌కత, ఇండోర్, భోపాల్, లక్నో, పట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చిన్, త్రివేండ్రం, గోవాల్లో వారంలో అందుబాటులో ఉంచనున్నారు. కోవిఫర్‌ అందుబాటులోకి రావడం గొప్ప మైలురాయిగా హెటిరో హెల్త్‌కేర్‌ ఎండీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి అభివర్ణించారు. ఈ ఔషధం ద్వారా రోగుల చికిత్స సమయం తగ్గి, ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. కోవిఫర్‌ వేగంగా అందుబాటులో ఉంచేందుకై ప్రభుత్వంతోపాటు ప్రైవేటు వైద్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు.

మరిన్ని వార్తలు