హెక్సావేర్‌ లాభం 26 శాతం అప్‌

30 Apr, 2020 06:18 IST|Sakshi

22 శాతం పెరిగిన ఆదాయం 

ఆదాయ అంచనాలకు కరోనా వేటు  

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ నికర లాభం ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో 26 శాతం పెరిగింది. గత ఏడాది క్యూ1లో రూ.138 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.175 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను సస్పెండ్‌ చేసింది. కరోనా వైరస్‌ కల్లోలంతో అనిశ్చితి నెలకొనడమే దీనికి కారణమని వెల్లడించింది. గత ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.1,264 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది ఇదే క్వార్టర్‌లో 22 శాతం ఎగసి రూ.1,542 కోట్లకు పెరిగిందని పేర్కొంది. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 18 శాతం వృద్ధితో 2.3 కోట్ల డాలర్లకు, ఆదాయం 17 శాతం వృద్ధితో 21 కోట్ల డాలర్లకు పెరిగిందని
తెలిపింది.  

26 శాతం పెరిగిన ఈపీఎస్‌...
ఈ క్యూ1లో ఒక్కో షేర్‌ రాబడి(ఈపీఎస్‌) 26 శాతం వృద్ధితో రూ.5.86కు పెరిగిందని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వికాస్‌ కుమార్‌ జైన్‌ వెల్లడించారు. నిర్వహణ సామర్థ్యాలపై దృష్టి పెట్టటంతో ఒక్కో షేర్‌ రాబడి ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించకముందే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను ప్రారంభించామని తెలిపారు. ఐటీ విభాగంలో 99 శాతం మంది, బీపీఎస్‌ విభాగంలో 80 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 19,998గా ఉందని, ఆట్రీషన్‌ రేటు 15.1 శాతమని పేర్కొన్నారు.   నికర లాభం 26 శాతం పెరగడంతో హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ షేర్‌ లాభపడింది. బీఎస్‌ఈలో ఈ షేర్‌ 3 శాతం లాభంతో రూ.296 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు