హైఎండ్‌ బైక్‌ల విక్రయాలు పెరుగుతాయి

24 Feb, 2018 01:11 IST|Sakshi

కవాసాకి మోటార్స్‌ ఆశాభావం  

కోల్‌కతా: కవాసాకి మోటార్స్‌ ఇండియా తన హైఎండ్‌ బైక్స్‌ విక్రయాలపై పూర్తి ఆశావహంగా ఉంది. భారత్‌లో ప్రీమియం బైక్‌ల విభాగంలో మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ‘పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు చేసినా కూడా ఇండియాలో ప్రీమియం బైక్స్‌ అమ్మకాల వృద్ధిపై నమ్మకంగా ఉన్నాం. అలాగే మరొకవైపు ప్రజల ఆదాయం కూడా పెరుగుతోంది. ఇది కూడా మాకు సానుకూలాంశం’ అని కవాసాకి మోటార్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ యుతకా యమాషితా తెలిపారు.

ప్రీమియం బైక్‌ మార్కెట్‌లో ప్రతి ఏడాది 30 శాతంమేర వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. కాగా కవాసాకి ప్రస్తుతం తన పుణే ప్లాంటులో 300 సీసీ– 1,400 సీసీ శ్రేణిలో ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన బైక్స్‌ను అసెంబుల్‌ చేస్తోంది. కంపెనీ 2017 ఏప్రిల్‌ నుంచి 1,500 యూనిట్ల బైక్స్‌ను భారత్‌లో విక్రయించింది. దీనికి దేశవ్యాప్తంగా 22 డీలర్‌షిప్స్‌ ఉన్నాయి. కాగా కవాసాకి గతంలో బజాజ్‌ ఆటోతో కుదుర్చుకున్న సేల్స్‌ అండ్‌ సర్వీసింగ్‌ ఒప్పందానికి గతేడాది ఏప్రిల్‌లో ముగింపు పలికిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు