‘యూపీఏ’ రుణాలవల్లే అధోగతి!

20 Aug, 2018 00:51 IST|Sakshi

మోదీ పాలనలో మెరుగైన వృద్ధి 

భవిష్యత్తులో సుస్థిర, అధిక,  సమ్మిళిత వృద్ధికి చర్యలు 

నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ 

న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియంత్రణలేని ద్రవ్యలోటు, నిర్లక్ష్యంతో బ్యాంకు రుణాల జారీ వంటివి ఆర్థిక క్షీణతకు దారితీశాయని నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. అలాగే రాజీవ్‌గాంధీ హయాంలో 10 శాతం వృద్ధి రుణాల వల్లేనని, ఇదే 1990–92 కాలంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి దారితీసిందని, రుణ చెల్లింపుల కోసం బంగారం నిల్వలను విదేశాలకు తరలించి గట్టెక్కాల్సి వచ్చిందని వివరించారు. 

జీడీపీ వృద్ధికి సంబంధించి నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎస్‌సీ) విడుదల చేసిన గణాంకాలపై కుమార్‌ స్పందించారు. ఈ గణాంకాల ప్రకారం... మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న 2006–07లో నమోదైన జీడీపీ వృద్ధి రేటు 10.08 శాతం అన్నది... సరళీకృత ఆర్థిక విధానాలు మొదలైన 1991 తర్వాత అత్యధిక వృద్ధి రేటు. కాగా, కేంద్రంలో మోదీ సర్కారు నాలుగేళ్ల పాలనలో నమోదైన వృద్ధి రేటు అంతకుపూర్వం యూపీఏ సర్కారు చివరి నాలుగేళ్ల పాలనకంటే ఎక్కువే ఉందంటూ రాజీవ్‌కుమార్‌ తన ట్వీట్లలో పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌సీ 2011–12 బేస్‌ ఆధారంగా వేసిన జీడీపీ వృద్ధి అంచనాలు అనధికారికమైనవిగా పేర్కొన్నారు. ‘‘అయినప్పటికీ ఈ వాస్తవ అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 2009–2011, అంతకుముందు సంవత్సరాల్లో అధిక వృద్ధి రేటు అన్నది అదుపులో లేని ద్రవ్యలోటు, వాణిజ్య బ్యాంకుల రుణాల వల్లే. అందుకే అది నిలబడలేదు. ఇదే యూపీఏ–2 సర్కారు చివరి మూడేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ పతనానికి, వృద్ధి అనూహ్యంగా తగ్గిపోయేందుకు కారణాలు’’ అని కుమార్‌ వివరించారు. 2013 ఏడాది మే–ఆగస్టు మధ్య నాలుగు నెలల్లోనే రూపాయి మారకం 25 శాతం పడిపోయినట్టు గుర్తు చేశారు. స్థిరమైన అధిక, సమ్మిళిత వృద్ధి భవిష్యత్తులో సాకారమయ్యేందుకు మోదీ సర్కారు నాలుగేళ్ల కాలంలో బలమైన పునాదులు పడ్డాయని చెప్పారు. ఇక వాజ్‌పేయి పాలనలో చేపట్టిన సంస్కరణలతో 2003–04లో వృద్ధి రేటు 8 శాతానికి పెరిగిందని, ఈ చర్యల వల్లే తర్వాతి యూపీఏ కాలంలో వృద్ధి రేటు పెరిగేందుకు దోహదపడినట్టు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ చెప్పారు.   

బ్యాక్‌సిరీస్‌ జీడీపీ గణాంకాలు అధికారికం కాదు: కేంద్రం 
బ్యాక్‌ సిరీస్‌ జీడీపీ గణాంకాలపై వివాదం నేపథ్యంలో అవి అధికారిక గణాంకాలు కాదని కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు విభాగం(ఎమ్‌వోఎస్‌పీఐ) పేర్కొంది. అధికారిక గణాంకాలను తర్వాత విడుదల చేయనున్నట్లు తెలిపింది. జీడీపీకి సంబంధించి నేషనల్‌ స్టాటిస్టిక్‌ కమిషన్‌ (ఎన్‌ఎస్‌సీ) గణాంకాల ప్రకారం 2006–07లో నమోదైన 10.08% వృద్ధి.. 1991 తర్వాత అధిక వృద్ధి రేటుగా తెలుస్తోంది. దీంతో ఇవి అధికారిక గణాంకాలు కావంటూ ఎమ్‌వోఎస్‌పీఐ పేర్కొంది. ఎన్‌ఎస్‌సీ సైతం బ్యాక్‌ కాస్టింగ్‌ జీడీపీ సిరీస్‌ విధానానికి సంబంధించి పని కొనసాగుతోందని స్పష్టం చేసింది.  
 

>
మరిన్ని వార్తలు