మరిన్ని రంగాల్లో... ఎఫ్‌డీఐలకు సై!

28 May, 2015 01:53 IST|Sakshi
మరిన్ని రంగాల్లో... ఎఫ్‌డీఐలకు సై!

భారీగా ఉద్యోగాల సృష్టే లక్ష్యం...
జీఎస్‌టీ, భూసేకరణ బిల్లుకు త్వరలో మోక్షం
పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: భారీగా ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉన్న మరిన్ని రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు గేట్లు తెరుస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకేతాలిచ్చారు.ప్రధానంగా దేశీయంగా ఉన్న నిపుణులకు కొలువుల కల్పనే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

అత్యంత కీలక సంస్కరణలైన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ), భూసేకరణ బిల్లుకు త్వరలోనే పార్లమెంటు ఆమోదం లభించనుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ విషయాలను వెల్లడించారు. భూసేకరణ బిల్లును వీలైనంత వేగంగా పాస్ చేయించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. అయితే, దీన్ని పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయడంతో కొంత సమయం పట్టొచ్చన్నారు. గ్రామాలు, పేదలు, రైతులకు ప్రయోజకరమైన ఎలాంటి సూచనలనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు.
 
ఎఫ్‌డీఐలు 39 శాతం పెరిగాయ్..
గడిచిన ఏడాది కాలంలో తమ ప్రభుత్వం తీసుకున్న అనేక సాహసోపేతమైన చర్యలతో పెట్టుబడులకు భారత్ మరింత ఆకర్షణీయమైన గమ్యంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇన్వెస్టర్లలో విశ్వాసం కూడా మెరుగుపడినట్లు చెప్పారు. మౌలిక రంగంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడమే లక్ష్యంగా జాతీయ మౌలిక పెట్టుబడుల నిధిని నెలకొల్పిన విషయాన్ని మోదీ  ప్రస్తావించారు. ‘జీఎస్‌టీ, భూసేకరణ బిల్లులు దేశ ఆర్థిక వ్యవస్థకు మేలుచేకూరుస్తాయి. రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు ఈ బిల్లులవల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించాలి.

జీఎస్‌టీ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందింది. రాజ్యసభలోనూ ఈ రెండు బిల్లులకూ ఆమోదం లభించే రోజు మరెంతో దూరంలో లేదు’ అని ప్రధాని వివరించారు. పార్లమెంటులో బిల్లులు పాస్ చేయడమే ‘సంస్కరణ’లకు ప్రధానమన్న భావన నెలకొందని.. అసలు కొత్త చట్టాలతో సంబంధం లేకుండా వివిధ సాయుల్లో విధానపరమైన నిర్ణయాలతో కూడా ప్రధానమైన సంస్కరణలకు ఆస్కారం ఉందన్నారు. డీజిల్ ధరలపై నియంత్రణ తొలగింపు.. వంటగ్యాస్ సబ్సిడీలను బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం, ఎఫ్‌డీఐ పరిమితుల పెంపు, రైల్వేలకు పునరుత్తేజం వంటివి ఇందులో భాగమేనని మోదీ వివరించారు. 2014-15 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలానికి ఎఫ్‌డీఐలు 39% వృద్ధి చెందాయని.. ఇది తమ ప్రభుత్వ ఘనతేనన్నారు.
 
ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం...
తొలి ఏడాది పాలనలో తాము చేపట్టిన పలు చర్యలకు సానుకూల స్పందన చూస్తుంటే... మరింతగా ప్రజలకు మంచిచేయాలన్న ఉత్సాహం లభిస్తోందని చెప్పారు. పీ2జీ2(నూతనోత్తేజం, ప్రజాపక్షం, సుపరిపాలన, మంచి సంస్కరణలు)పై తాము ప్రధానంగా దృష్టిపెట్టామని, దీంతోపాటు కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసి, సంస్కరణల విషయంలో ఏకతాటిపై నడిచేలా చేయడం కూడా ఈ చర్యల్లో భాగమేనని ప్రధాని పేర్కొన్నారు.

ఆర్థిక వృద్ధి రేటు విషయంలో అన్ని లక్ష్యాలను అందుకోగలమన్న నమ్మకం ఉందని కూడా చెప్పారు. కాగా, మోదీ సర్కారు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలు.. అదేవిధంగా ఆచరణలో ఎలాంటి పురోగతీ లేదంటూ దీపక్ పరేఖ్ వంటి కార్పొరేట్లు చేస్తున్న వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు మోదీ తనదైన శైలిలో స్పందించారు. ‘అసలు మీరు అడిగిన ప్రశ్నలోనే జవాబు కూడా ఉంది. ప్రభుత్వం మాకు సహకరించడం లేదని కార్పొరేట్లు వాదిస్తున్నప్పుడు  వాళ్లకు అనుకూలంగా ఉన్నామన్న ప్రతిపక్షాల ఆరోపణలు అర్థరహితం. వాస్తవానికి మా నిర్ణయాలన్నీ ప్రజాపక్షమే.

దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రధాని వివరించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కితెస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం పగ్గాలు చేపట్టిన వెంటనే దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు. నల్లధనానికి అడ్డుకట్ట కోసం కొత్తగా చట్టాన్ని కూడా తీసుకొచ్చిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు.
 
ఆర్‌బీఐతో విభేదాల్లేవు...
రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ), ఆర్థిక శాఖల మధ్య విభేదాలు నెలకొన్నాయన్న వార్తలను మోదీ కొట్టిపారేశారు. ‘పీటీఐ వంటి విశ్వసనీయమైన వార్తా సంస్థలు కూడా వివిధ సందర్భాల్లో వ్యక్తమైన అభిప్రాయాల ఆధారంగా ఈ విధమైన అవాస్తవ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఎల్లప్పుడూ గౌరవిస్తాయి. అంతేకాదు ఆర్‌బీఐ స్వేచ్ఛను కాపాడటం మా కర్తవ్యం కూడా’ అని ప్రధాని తేల్చిచెప్పారు.

మరిన్ని వార్తలు