అధిక స్థాయిలోనే ధరలు

19 Sep, 2015 01:02 IST|Sakshi
అధిక స్థాయిలోనే ధరలు

ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ అభిప్రాయం
♦ ఇటీవలి ద్రవ్యోల్బణం తగ్గుదల
♦ బేస్ ఎఫెక్ట్ ప్రభావమని విశ్లేషణ
♦ అల్లకల్లోల సముద్రంలో భారత్ ఒక ప్రశాంత దీవి అని వ్యాఖ్య
 
 న్యూఢిల్లీ : అమెరికా ఫెడ్ రేట్ల పెంపును వాయిదావేసిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు కోత సెప్టెంబర్ 29న ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో, దీనికి భిన్నమైన ధోరణిలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు చేశారు. రేటు కోత నిర్ణయం ‘ద్రవ్యోల్బణం అదుపు’పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆగస్టు నెల చరిత్రాత్మక కనిష్ట స్థాయి 3.6 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం పడిపోవడం- బేస్ ఎఫెక్ట్‌గా కూడా ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి ఈ వ్యాఖ్య సెప్టెంబర్ 29 రెపో రేటు కోతపై పలువురి అంచనాలపై నీళ్లు జల్లుతోంది.

గత ఏడాదే ధరల పెరుగుదల శాతం అధికంగా వుండటం వల్ల... అప్పటితో పోల్చితే (క్రితం ఏడాది ప్రాతిపదిక) ఈ ఆగస్టు నెలలో పెరుగుదల శాతం తక్కువవుండటమే బేస్ ఎఫెక్ట్. కానీ మొత్తం మీద ఈ ఏడాదీ ధరలు పెరిగాయ్.  బేస్ ఎఫెక్ట్‌ను తొలగిస్తే... వాస్తవ ద్రవ్యోల్బణం 5% వరకూ ఉం టుందని కూడా రాజన్ తాజాగా వ్యాఖ్యానించారు. ఇక్కడ జరిగిన సీకే ప్రహ్లాద్ నాల్గవ స్మారక కార్యక్రమంలో ఆయన పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ద్రవ్యోల్బణం అదుపులో ఉండడమే కీలకం.

అయితే ఇది కేవలం ఇప్పుటికే సంబంధించిన అంశం కాదు. భవిష్యత్తుకూ ఇది అవసరమే.’ అని ఆయన అన్నారు. ‘ఇప్పుడు మీ కెమెరాలు అన్నీ దేనికోసం చూస్తున్నాయో నాకు తెలుసు. నా స్పందన యథాతథమే. మీరు రానున్న విధాన ప్రకటన వరకూ వేచి చూడాల్సి ఉంది. ఇంకా ఆయన ఏమన్నారంటే...

►అల్లకల్లోల సముద్రంలో భారత్ ఒక ప్రశాంత దీవి. పలు దేశాలు వృద్ధికి ఇబ్బందులు పడుతుంటే... భారత్ ఆర్థిక వ్యవస్థ మాత్రం మంచి పనితీరును కనబరుస్తోంది.
►వృద్ధి దిశలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇక్కడ మనం బ్రెజిల్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వేగంగా అభివృద్ధి చెందాలనుకున్న దేశం ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతోంది.  ప్రభుత్వ రుణ భారం, అవినీతి, కంపెనీల నష్టాలు, మొండిబకాయిల సమస్యల్లో బ్రెజిల్ కూరుకుంది.
►వృద్ధి ప్రగతిలో పటిష్ట వ్యవస్థల పాత్రా కీలకం.

 అధిక విలువ నోట్లు అందుకే ముద్రించడం లేదు
 పొరుగు దేశాలతో సంక్లిష్టమైన సంబంధాల కారణంగా నకిలీ నోట్లు వెల్లువెత్తవచ్చన్న ఆందోళన వల్లే అధిక విలువ గల నోట్ల ముద్రణ ఆర్‌బీఐకి కష్టంగా ఉంటోందని రాజన్ చెప్పారు. సిసలైనవిగా కనిపించే రూ. 500 నకిలీ నోట్లను తాను అనేకం చూశానని, ఇలాంటివి అరికట్టేందుకు ఎప్పటికప్పుడు అదనపు భద్రతా ఫీచర్లను జోడి స్తూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు