ఇక విమానాల్లో హిందూ భోజనం కట్‌

4 Jul, 2018 13:26 IST|Sakshi

దుబాయ్‌ : దుబాయ్‌ అధికారిక విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ తన అధికారిక మెనూ నుంచి ‘హిందూ మీల్స్‌’ ఆప్షన్‌ను తొలగించింది. బుధవారం విమానయాన సంస్థ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రయాణికులకు మేము కల్పించే సేవలు గురించి నిరంతరం పరిశీలిస్తాం. మేము ప్రకటించే ఆఫర్ల గురించి, సేవల గురించి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుంటాం. ఇది మా సేవలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దానిలో భాగంగానే ఆన్‌ బోర్డ్‌ ప్రొడక్ట్స్‌, సేవల విషయంలో ప్రయాణికులు ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగానే ఎమిరేట్స్‌ మెనూలోంచి హిందూ మీల్స్‌ను తొలగించాం’ అని ఎమిరేట్స్‌ అధికారులు తెలిపారు.

అంతేకాక ‘ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా మా విమానయాన సంస్థలో ఆహారాన్ని, డ్రింక్స్‌ను అందిస్తాం. మా దగ్గర చాలా మంచి చెఫ్‌లు ఉన్నారు. వారు ప్రయాణికుల అభిరుచులకనుగుణంగా, మా సాంప్రదాయలను ప్రతిబింబించే రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. మేము ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పదార్ధాలను తయారు చేయిస్తాం’ అని తెలిపారు. ఇక మీదట హిందూ ప్రయాణికులు, శాఖాహార ప్రయాణికులు శాఖాహార జైన్‌ ఆహారం, భారతీయ శాఖాహార భోజనం, కోశర్‌ భోజనం, నాన్‌ బీఫ్‌ నాన్‌ వెజిటేరియన్‌ నుంచి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు