జెట్‌లో పెట్టుబడులపై హిందుజా ఆసక్తి 

22 May, 2019 00:51 IST|Sakshi

ముంబై: ఆర్థిక సంక్షోభం కారణంగా దాదాపు నెల రోజుల్నించి కార్యకలాపాలు నిలిపివేసిన ప్రైవేట్‌ రంగ జెట్‌ ఎయిర్‌వేస్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను హిందుజా గ్రూప్‌ పరిశీలిస్తోంది. మంగళవారం ఈ విషయం ఒక ప్రకటనలో తెలియజేసింది.  రుణాలు, నష్టాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఏప్రిల్‌ 17 నుంచి జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జెట్‌ విక్రయంపై కసరత్తు చేస్తున్నాయి. ఎతిహాద్‌ గ్రూప్‌ వంటి సంస్థలు బిడ్లు వేశాయి. ప్రస్తుతం వివిధ విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ స్లాట్స్‌ను ఇతర ఎయిర్‌లైన్స్‌కు తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర పౌర విమానయాన శాఖ కేటాయించింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్‌ ఆసక్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హిందుజా గ్రూప్‌నకు ఆటోమోటివ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులు, విద్యుత్, రియల్‌ ఎస్టేట్, హెల్త్‌కేర్‌ తదితర రంగాల్లో కార్యకలాపాలున్నాయి. గ్రూప్‌ సంస్థల్లో దాదాపు 1,50,000 మంది పైచిలుకు ఉద్యోగులున్నారు.   పెట్టుబడులు పెట్టేందుకు హిందుజా గ్రూప్‌ ఆసక్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు ఏకంగా 15 శాతం ఎగిశాయి. బీఎస్‌ఈలో 14.73 శాతం పెరిగి రూ.150.75 వద్ద ముగిశాయి. అటు ఎన్‌ఎస్‌ఈలో సుమారు 13 శాతం పెరిగి రూ. 148.40 వద్ద క్లోజయ్యాయి. రూ.135 వద్ద ప్రారంభమైన షేరు ఒక దశలో రూ. 154.80 గరిష్ట స్థాయికి కూడా ఎగిసింది. దీంతో వరుసగా రెండో రోజూ జెట్‌ షేరు పెరిగినట్లయింది.    

మరిన్ని వార్తలు