షిప్‌యార్డుకు 15 వేల కోట్ల ఆర్డర్లు

14 Sep, 2017 01:30 IST|Sakshi
షిప్‌యార్డుకు 15 వేల కోట్ల ఆర్డర్లు

2016–17లో లాభం రూ.53.77 కోట్లు
రికార్డు స్థాయిలో 629 కోట్ల టర్నోవర్‌
షిప్‌యార్డు అమ్మకం వార్తలు అవాస్తవం
హెచ్‌ఎస్‌ఎల్‌ సీఎండీ శరత్‌బాబు  

సాక్షి, విశాఖపట్నం: రక్షణరంగంలో ఉన్న విశాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) ఆర్థిక ప్రతికూలతలను అధిగమించి లాభాల బాట పడుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.53.77 కోట్ల లాభాన్ని ఆర్జించింది. హెచ్‌ఎస్‌ఎల్‌ ఏర్పాటై 65 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాని ప్రగతి, ఒప్పందాలు, ఆర్డర్లు తదితర వివరాలను సీఎండీ రియర్‌ అడ్మిరల్‌ ఎల్‌.వి.శరత్‌బాబు బుధవారమిక్కడ విలేకరులకు తెలియజేశారు. 75 ఏళ్ల షిప్‌యార్డు చరిత్రలో తొలిసారిగా 2016–17లో రికార్డు స్థాయిలో రూ.629 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్టు వెల్లడించారు. షిప్‌యార్డుకు ఇటీవల రెండు భారీ ఆర్డర్లు వచ్చాయని, వీటిలో ఒకటి రూ.10 వేల కోట్లు, మరొకటి రూ.5 వేల కోట్ల విలువ చేస్తాయని తెలియజేశారు.

 ‘‘ఇవి నేవీ, కోస్టుగార్డు నౌకల నిర్మాణానికి సంబంధించినవి. మరోవంక భారత నావికాదళానికి రూ.2500 కోట్ల విలువైన రెండు మినీ సబ్‌మెరైన్‌ వంటి స్పెషల్‌ ఆపరేషన్‌ వెస్సల్స్‌ను (ఎస్‌ఓవీ) నిర్మించి ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కూడా కుదిరింది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఒప్పందాలు జరుగుతాయి’’ అని శరత్‌బాబు వివరించారు. హ్యుందాయ్‌ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఐదు నౌకలను నిర్మించాల్సి ఉందన్నారు. వీటిలో ఒకటి కొరియాలోనూ, మిగిలిన నాలుగు ఇక్కడ షిప్‌యార్డులోనూ నిర్మిస్తామని, ఈ ప్రాజెక్టు విలువ రూ.9,800 కోట్లని తెలిపారు.

అమ్మకం వార్తలు అబద్ధం..
హిందుస్తాన్‌ షిప్‌యార్డును రిలయన్స్‌కో, మరొకరికో విక్రయిస్తున్నారని వస్తున్న వార్తలు పచ్చి అబద్ధమని సీఎండీ స్పష్టం చేశారు. ఈ ప్రచారం వల్ల షిప్‌యార్డు ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సార్‌  కేసులో షిప్‌యార్డు ఆస్తుల అటాచ్‌ చేస్తూ జిల్లా కోర్టు ఆదేశాలివ్వడం నిజమేనన్నారు. ‘‘దీనిపై హైకోర్టుకెళ్లాం. 8 వారాలపాటు స్టే ఇచ్చింది. రూ.200 కోట్ల విలువైన ఈ వ్యవహారంలో ఓఎన్‌జీసీ, ఎస్సార్‌ ఆయిల్‌లతో చాన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. త్వరలోనే పరిష్కారమవుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు హేమంత్‌ ఖత్రి, ఏఎస్‌ మిత్ర, పీఎస్‌ఎన్‌ శాలిహ, హెచ్‌ఆర్‌ జీఎం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు