ఆరు నెలల తర్వాత హైరింగ్‌ జోరు!

9 Jul, 2020 13:45 IST|Sakshi

కెరీర్‌నెట్‌ కన్సల్టింగ్‌ అంచనా

బెంగళూర్‌ : కోవిడ్‌-19 ప్రభావంతో కుదేలైన నియామకాల ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి నుంచి ఊపందుకుంటుందని రిక్రూట్‌మెంట్‌ సంస్థ కెరీర్‌నెట్‌ కన్సల్టింగ్‌ సంస్థ పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తితో క్యాంపస్‌ నియామకాలూ నిలిచిపోయాయని, హైరింగ్‌ ప్రక్రియ వేగవంతం కావడానికి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపింది. కరోనా కారణంగా నియామకాలను నిలిపివేసిన కంపెనీలు కూడా ఆరు నెలల తర్వాత చురుకుగా హైరింగ్‌ చేపడతామని పేర్కొన్నాయి. తమ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 43 శాతం కంపెనీలు వచ్చే ఏడాది జనవరిలో నియామకాలకు వెళతామని వెల్లడించాయని కెరీర్‌నెట్‌ పేర్కొంది. 2021 ఏప్రిల్‌ నాటికి కోవిడ్‌-19కు ముందున్న పరిస్థితి నెలకొంటుందని కెరీర్‌నెట్‌ సహవ్యవస్ధాపకులు అన్షుమన్‌ దాస్‌ అంచనా వేశారు.

మరోవైపు క్యాంపస్‌ నియామకాలు కొంతమేర తగ్గే అవకాశాలున్నాయని వెల్లడైంది. ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు వెళ్లే ఆలోచనలేదని 27 శాతం కంపెనీలు పేర్కొనగా, 39 శాతం కంపెనీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. కెరీర్‌నెట్‌ నివేదిక ప్రకారం కేవలం 30 శాతం కంపెనీలే ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు వెళతామని వెల్లడించాయి. ఈ ఏడాది ఇప్పటికే క్యాంపస్‌ హైరింగ్‌ వాయిదా పడిందని, ఆర్థిక వ్యవస్థ గాడినపడితే కంపెనీలు తమ హైరింగ్‌ ప్రణాళికలను ముమ్మరం చేస్తాయని దాస్‌ పేర్కొన్నారు. స్టార్టప్‌లపై కోవిడ్‌-19 ప్రభావం చూపుతుండగా, ఐటీ కంపెనీల్లో మాత్రం వేచిచూసే ధోరణి కనిపిస్తోంది. దిగ్గజ ఐటీ కంపెనీల్లో నాలుగింట మూడు సంస్ధలు గతంలో తాము ఇచ్చిన ఆఫర్లకు కట్టుబడి ఉంటామని తెలిపాయని ఈ సర్వే పేర్కొంది. చదవండి : కోవిడ్‌ 19 : ఎంఐటీ సర్వేలో షాకింగ్ వివరాలు

మరిన్ని వార్తలు